తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి జాల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు రావాలని ఆయనకు సూచించారు. అదేవిధంగా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తిరుపతిలోని గోశాలపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడా తీసుకురావాలని పోలీసులు ఆయనకు తెలిపారు. విచారణకు రాకపోతే.. కేసు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఏం జరిగింది?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తిరుమల ప్రతిష్ఠ దిగజారిందని, తిరుపతిలోని గోశాలలో సంరక్షణ చర్యలు చేపట్టడం లేదని భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో గోశాలలోని వందలాది గోవులు మృతి చెందాయంటూ.. అప్పట్లో ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. గోశాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు. దీనిని అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు ఖండించారు. వైసీపీ హయాంలోనే ఎక్కువగా గోవులు మృతి చెందాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇరు పక్షాలు కూడా.. లెక్కలు చెప్పుకొచ్చాయి. గోశాలలో 150 గోవులు చనిపోయాయని. దీనికి టీటీడీ బాధ్యత వహించాలని అప్పట్లో భూమన ఆరోపించారు. అయితే.. కేవలం 30-45 గోవులు మాత్రమే చనిపోయాయని టీటీడీఈవో వివరించారు. ఇలా ఇరు పక్షాల మధ్య వాగ్వాదం.. వివరణలు.. మీడియా ముందు విమర్శలు చోటు చేసుకున్నాయి. అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు.. తర్వాత కాలంలో మౌనంగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు భూమనకు నోటీసులు ఇచ్చారు.
అంతా రాజకీయం: భూమన
తనకు నోటీసులు ఇవ్వడం పట్ల భూమన స్పందించారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. రెండు మాసాల కిందట చేసిన ఆరోపణలపై ఇప్పుడు స్పందించడం ఏంటని ప్రశ్నించారు. విచారణకు హాజరవుతానన్న భూమన.. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తానని.. చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వాలని ఆయన పోలీసును కోరారు.