బీజేపీ నాయకురాలు, గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు మాధవీ లతకు.. తాజాగా జూబ్లీహిల్స్ ఓటర్లు షాకిచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆమె ఇంటింటికీ తిరుగుతూ.. అభ్యర్థి లంకలపల్లి దీపక్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. పాంప్లేట్స్ అందిస్తూ.. అందరినీ కలుస్తున్నారు. అయితే.. పలువురు మహిళలు మాధవీ లతను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మాకు మీరు ఏం చేశారు? అని మెజారిటీ ప్రజలు ప్రశ్నించారు.
దీనికి ఆమె.. కేంద్రం నుంచి వస్తున్న నిధులు.. పెట్టుబడులను ప్రస్తావించారు. అయితే.. అవన్నీ కేసీఆర్, రేవంత్ రెడ్డి తెచ్చారని.. మీరు ఏం చేశారని మాధవీలతను గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో ఆమె సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, మరికొందరు మహిళలు.. గత ఎన్నికలలో కూడా మీకే ఓటేశామని అన్నారు. అయినా.. ఓడిపోయారు కదా! అని అనగానే.. ఏ గుర్తుకు ఓటేశారని ఆమె ప్రశ్నించారు. దీనికి వారు కారు గుర్తుకు ఓటేశామని చెప్పడంతో మా గుర్తు అదికాదు.. అని మాధవీ లత అన్నారు.
అదేమో మాకు తెలీదు.. మాకు తెలిసింది కారు గుర్తే అంటూ.. కొందరు వృద్ధులు సమాధానం చెప్పడంతో వారిని సముదాయించలేక మాధవీ లత ఇబ్బంది పడ్డారు. ఇక, యువత కూడా.. మాధవీ లతను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. మోడీ రాగానే తమ ఎకౌంట్లలో డబ్బులు వేస్తానని హామీ ఇచ్చారని.. ఆ డబ్బులు ఏవని ప్రశ్నించారు. వివిధ పథకాల కింద వేస్తున్నారు కదా! అని మాధవీ లత సమాధానం ఇచ్చినప్పుడు.. అవి తమకు రావడం లేదన్నారు. దీంతో మాధవీ లత అక్కడనుంచి జారుకున్నారు.
ఇక, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై మాధవీలత విమర్శలు గుప్పించినప్పుడు.. మీరొస్తే.. ఏం చేస్తారంటూ.. స్థానికులు ప్రశ్నించారు. త్వరలో చెబుతామని మాధవీలత అన్నారు. ఈ సమయంలో కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఇలా.. మొత్తంగా మాధవీ లత ప్రచారం అనుకున్న విధంగా సాగలేదు. దీంతో ఆమె తిరిగి పార్టీ కార్యాలయానికి వెళ్లి.. నాయకులతో చర్చించారు. ఏం చెప్పాలంటూ.. పార్టీ నాయకులను అడిగారు. సో.. మొత్తానికి బీజేపీ విషయంపై జూబ్లీహిల్స్ ఓటరు కొంత అసంతృప్తితోనే ఉన్నట్టు స్పష్టమైంది.