మలయాళంలో బాక్సాఫీస్ రికార్డులన్నీ కొల్లగొడుతూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం రేపింది లోక-చాప్టర్ 1 సినిమా. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. సౌత్ ఇండియాలో వచ్చిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీ ఇది. ఈ చిత్రాన్ని తెలుగులో కొత్త లోక-చాప్టర్ 1 పేరుతో రిలీజ్ చేసి మంచి ఫలితాన్నందుకున్నాడు ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఐతే మలయాళం మూవీ కాబట్టి ఈ సినిమాను ఆదరించారు కానీ.. నేరుగా తెలుగులో తీసి రిలీజ్ చేసి ఉంటే అది డిజాస్టర్ అయ్యేది అంటున్నాడు నాగవంశీ.
తన బేనర్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం మాస్ జాతర ప్రమోషన్లలో భాగంగా నాగవంశీ.. హీరో రవితేజతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ చేసింది మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ శంకర్ కావడం విశేషం. ఈ ముగ్గురూ కలిసి తెలుగు ప్రేక్షకుల సినీ అభిరుచి గురించి.. సోషల్ మీడియాలో సినిమా చర్చలు పెట్టే వాళ్ల గురించి మాట్లాడారు.
ఈ క్రమంలోనే నాగవంశీ.. లోక మూవీ గురించి మాట్లాడాడు. ఆ సినిమాను తెలుగులో తీస్తే లాజిక్కుల గురించి మాట్లాడి, ఇదేం సినిమా అని ఫ్లాప్ చేసేవాళ్లని అన్నాడు. మన ఆడియన్స్ ఎప్పుడు ఏ సినిమాను ఆదరిస్తారో చెప్పలేమని అతనన్నాడు. లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో హీరో హీరోయిన్లు, దర్శకుడు ఎవరో తెలియదని.. అయినా దానికి ప్రిమియర్స్ వేస్తే అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయని.. సినిమా ఎవ్వరూ ఊహించనంత పెద్ద హిట్ అయిందని నాగవంశీ అన్నాడు.
సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండుగలకు మాస్ సినిమాలు తీస్తే ఆహా ఓహో అంటారని.. మిగతా టైంలో మాస్ సినిమాలు వస్తే రొటీన్ అని ముద్ర వేసేస్తారని, నాగవంశీతో పాటు రవితేజ కూడా కామెంట్ చేశాడు. కరోనా తర్వాత ఓటీటీలో సినిమాలు చూసేవాళ్లు పెరిగిపోయారని.. వాళ్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడరని.. కానీ మాస్ సినిమాల గురించి మాత్రం తేలిగ్గా కామెంట్ చేస్తారని రవితేజ అన్నాడు.
తాను నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సహా ప్రయోగాత్మక చిత్రాలు చాలా చేసినా అవి ఆడలేదని రవితేజ చెప్పాడు. అలా అని మాస్ సినిమాలు చేసిన ప్రతిసారీ ఆడవని.. వాటికి కూడా మీటర్ సరిగ్గా ఉండాలని మాస్ రాజా వ్యాఖ్యానించాడు. చేతిలో ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి సినిమా గురించి కామెంట్ చేసేస్తారని.. మాస్ సినిమాలను విమర్శిస్తే అతడికేదో సినిమా నాలెడ్జ్ బాగా ఉన్నట్లు, డిఫరెంట్‌గా ఆలోచిస్తాడన్నట్లు ఫీలైపోతారని నాగవంశీ వ్యాఖ్యానించాడు.