hyderabadupdates.com movies ఉమ్మ‌డి కృష్ణాలో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు హాట్.. హాట్‌గా…!

ఉమ్మ‌డి కృష్ణాలో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు హాట్.. హాట్‌గా…!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు రాజ‌కీయాలు హాట్ హాట్‌గానే కొన‌సాగుతున్నాయి. ఎన్నిక‌ల అనంత‌రం.. టీడీపీ నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకున్న ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సొంత పార్టీ నాయ‌కుల మ‌ధ్యే విభేదాలు, వివాదాలు కొన‌సాగుతున్నాయి. సాధార‌ణంగా సొంత పార్టీ న‌య‌కులు క‌లివిడిగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయినా.. నాయ‌కులు ఆయ‌న మాట‌ను పెడ‌చెవిన పెడుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలే.. గ‌న్న‌వ‌రం, తిరువూరు. గ‌న్న‌వ‌రంలో ఎమ్మెల్యే వ‌ర్సెస్ నాయ‌కుల‌కు మ‌ధ్య వివాదాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి వ‌చ్చిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. అయితే.. దీనిని స్థానిక నాయ‌కులు విభేదించారు. అయిన‌ప్ప‌టికీ.. మార్పు అనివార్య‌మైన నేప‌థ్యంలో చంద్ర‌బాబు యార్ల‌గడ్డ‌నే ప్రోత్స‌హించారు. అయితే.. అప్ప‌టి నుంచి స్థానిక నాయ‌కులు ఆయ‌న‌ను విభేదిస్తున్నారు. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ నేత బ‌సవారావు వ‌ర్గం త‌ర‌చుగా యార్ల‌గ‌డ్డ‌పై విమ‌ర్శ‌లు చేస్తోంది.

తాజాగా పార్టీ అధినేత, సీఎం చంద్ర‌బాబు నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇవ్వాల‌ని నిర్న‌యించారు. అయితే.. త‌మ‌ను ప‌క్క‌న పెట్టారంటూ.. యార్ల‌గ‌డ్డ‌పై బ‌స‌వారావు వ్యాఖ్యానించారు. త‌మ వారికి ప‌ద‌వులు ఇవ్వ‌డం ఎమ్మెల్యేకు ఇష్టం లేద‌ని… వ‌చ్చే ఎన్నిక‌ల్లోత‌మ స‌త్తా చూపిస్తామ‌ని అన్నారు. ఇక‌, తిరువూరు నియోజ‌క వ‌ర్గం ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు.. త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. సొంత ప్ర‌భుత్వ ప‌నితీరునే ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు. కొన్నాళ్లు అధికారుల‌పైనా.. మ‌రికొన్ని రోజులు ఇత‌ర అంశాల‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాజాగా ఎంపీ కేశినేని చిన్ని విష‌యంపై నిప్పులు చెరుగారు. త‌మ వారికి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎంపీ పీఏ ద్వారా.. ప‌ద‌వులు విక్ర‌యించుకుంటున్నార‌ని హాట్ కామెంట్లు చేశారు. దీనిపై ఈ నెల 24న తాడోపేడో తేల్చుకునేందుకు తాను సిద్ధ‌మ‌ని కూడా ప్ర‌క‌ట‌న చేశారు. క‌నీసం.. త‌నను ఎమ్మెల్యేగా కంటే.. మ‌నిషిగా కూడా ఎంపీ వ‌ర్గం గుర్తించ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ప‌రిణామాల‌తో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి.

Related Post