ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఫ్రాంఛైజీ సినిమాల హవా నడుస్తోంది. ఒక క్యారెక్టర్ లేదా కథ క్లిక్ అయితే.. ఆ వరల్డ్‌ను కొనసాగిస్తూ వరుసగా సినిమాలు తీస్తున్నారు. దీంతో పాటు సినిమాటిక్ యూనివర్శ్‌లు, క్రాస్ ఓవర్లు కూడా పెరుగుతున్నాయి. ఈ ట్రెండుకు ఊపు తీసుకొచ్చిన ఘనత తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌దే. ఖైదీ సినిమాకు, విక్రమ్ మూవీకి కనెన్షన్ పెట్టడంతో ప్రేక్షకులు క్రేజీగా ఫీలయ్యారు. ఆ తర్వాత మరి కొన్ని చిత్రాలు ఈ బాటలో నడిచాయి.తాజాగా ‘ఓజీ’ సినిమాతో సాహో మూవీతో క్రాస్ ఓవర్ చూశాం.
ఈ కోవలోనే మ్యాడ్, డీజే టిల్లు సినిమాల క్రాస్ ఓవర్ కోసం ప్లానింగ్ జరుగుతుండడం విశేషం. ‘మ్యాడ్’ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు తీశాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఆ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలు తీశాడు. ఈ నాలుగు చిత్రాలూ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు మ్యాడ్, టిల్లు సినిమాలకు కొనసాగింపుగా మ్యాడ్ క్యూబ్, టిల్లు క్యూబ్ కూడా ప్లానింగ్‌లో ఉన్నాయి.
ఈ రెండు చిత్రాలనూ ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకరే రూపొందించబోతుండడం విశేషం. అంతే కాక మ్యాడ్, టిల్లు సినిమల క్రాస్ ఓవర్‌తో ఒక సినిమా కూడా అనుకుంటున్నారు. అలాంటిది చేస్తే మీరు అందులో నటించడానికి సిద్ధమా అని కళ్యాణ్.. ఒక ఇంటర్వ్యూలో మాస్ రాజా రవితేజను అడిగాడు. వెంటనే రవితేజ తప్పకుండా చేస్తా అన్నాడు. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’ సినిమాలోని పాత్ర తరహాలో క్యారెక్టర్ పెడదాం అంటూ కళ్యాణ్ ప్రపోజ్ చేయగా.. కచ్చితంగా నటిస్తానని, అందుకోసం ప్లాన్ చేసుకోమని చెప్పాడు రవితేజ. ఈ సినిమాకు ‘మాస్ మ్యాడ్ క్యూబ్’ అని పెడదాం అంటూ టైటిల్ కూడా సజెస్ట్ చేశాడు కళ్యాణ్. మరి నిజంగా ఈ క్రేజీ క్రాస్ ఓవర్, రవితేజ క్యామియో సాధ్యమవుతాయేమో చూడాలి.