ఎక్కడైనా రాజకీయాల్లో ఉన్న నాయకులకు కుటుంబం నుంచి భరోసా ఉంటుంది. సహకారం ఉంటుంది. అదేవిధంగా మద్దతు కూడా లభిస్తుంది. కానీ, ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో కుటుంబాల్లో రాజకీయ చిచ్చు రాజుకుంటోంది. తాజాగా కర్ణాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్యకు కూడా సుపుత్రుడి నుంచి సెగ రాజుకుంది. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తోనే కొంత తలనొప్పులు ఎదుర్కొంటున్న సిద్దూకు.. ఇప్పుడు సొంత ఇంటి నుంచే రాజకీయ సెగ తగలడంతో ఇది ఎటు దారితీస్తుందోనన్న చర్చ సాగుతోంది.
ఏం జరిగింది?
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీకే శివకుమార్(పార్టీ రాష్ట్ర చీఫ్) కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇక, సిద్దరామయ్య కూడా కృషి చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసుకున్నాక.. సీఎం సీటు వ్యవహారం ఈ ఇద్దరు నాయకుల మధ్య దోబూచులాడింది. అయితే.. అప్పటికి డీకేపై సీబీఐ కేసులు ఉండడంతో పార్టీ అధిష్టానం అన్నీ ఆలోచించి.. సిద్దరామయ్యకు అవకాశం ఇచ్చింది. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత.. డీకేను ముఖ్యమంత్రి చేస్తారన్న ప్రచారం తెరమీదికి వచ్చింది.
ఈ విషయంపై పార్టీ అధిష్టానం నుంచి ఇంకా క్లారిటీ లేదు. కానీ రాజకీయంగా తరచు డీకే ఈ విషయంపై స్పందించడం.. సిద్దరామయ్య తోసిపుచ్చడం తెలిసిందే. ఐదేళ్లపాటు తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్నారు. ఈ క్రమంలో సిద్దరామయ్య కుమారుడు, వృత్తి రీత్యా డాక్టర్, ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా ఉన్న యతీంద్ర తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి(సీఎం సిద్దరామయ్య) వయసు రీత్యా వెనుకబడ్డారని, ఆయన పని అయిపోయిందని వ్యాఖ్యానించారు.
వాస్తవానికి 2023 ఎన్నికల్లో తండ్రి కోసం వరుణ నియోజకవర్గాన్ని యతీంద్ర త్యాగం చేశారు. ఈ క్రమంలోనే తాను ఎమ్మెల్సీ అయ్యారు. అయితే.. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినా.. అది ఫలించలేదు. దీంతో ఏకంగా తండ్రిపైనే ఆయన తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ క్రమంలో తాజాగా తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
“రాజకీయాల్లో మా నాన్న చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు ఆయనకు కావాలి. సతీశ్ ఝర్కిహోళికి ఆ లక్షణాలు ఉన్నాయి.“ అని యతీంద్ర వ్యాఖ్యానించడం కాంగ్రెస్ను కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలో సీఎం మార్పును ఉద్దేశించే యతీంద్ర ఇలా మాట్లాడి ఉంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా.. సొంత కుమారుడి నుంచే పనైపోయిందన్న వ్యాఖ్యలు రావడంతో సీఎం సిద్దరామయ్య పనులు వాయిదా వేసుకుని.. ఇంటికి పరిమితం అయ్యారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.