విశాఖపట్నానికి ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ రావడం మీద వైసీపీ కార్యక్తలు గత కొన్ని రోజులుగా ఎంత రాద్దాంతం చేస్తున్నారో, ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నారో తెలిసిందే. 80 వేల కోట్లకు పైగా పెట్టుబడితో గూగుల్.. ఈ డేటా సెంటర్, ఏఐ హబ్‌లను ఏర్పాటు చేస్తుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. కూటమి ప్రభుత్వం మీద సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. జనాల్లో కూడా దీనిపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.
కానీ వైసీసీ వాళ్లు మాత్రం గూగుల్ డేటా సెంటర్ల వల్ల అసలు ప్రయోజనమే లేదని.. దీని ద్వారా వచ్చేవి కేవలం 200 ఉద్యోగాలని.. వేరే దేశాల నుంచి జనాల వ్యతిరేకతను తట్టుకోలేక ఇండియాను వేదికగా ఎంచుకున్నారని.. డేటా సెంటర్లకు నీళ్లు భారీగా అవసరం పడతాయని.. దీని వల్ల వైజాగ్‌లో నీటి సమస్య తలెత్తుతుందని.. విద్యుత్ వినియోగం పెరిగి జనం మీద భారం పడుతుందని.. పర్యావరణం దెబ్బ తింటుందని.. ఇలా అనేక ప్రతికూలతలను చూపించి ఇదొక వేస్ట్ వ్యవహారం అన్నట్లుగా విమర్శలు గుప్పించారు.
గూగుల్‌కు రాయితీలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు.ఐతే గత వారం పది రోజులుగా గూగుల్ డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తుంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి వాళ్ల గాలి తీసేశారు. గూగుల్ డేటా సెంటర్ గురించి ఆయన చాలా సానుకూలంగా మాట్లాడారు. తాము దీన్ని ఎంతమాత్రం వ్యతిరేకించడం లేదని, ఆహ్వానిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు తక్కువే కావచ్చని.. కానీ దాని ద్వారా పెద్ద ఎకో సిస్టమ్ తయారవుతుందని.. అనేక వేరే కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయని ఆయన చెప్పారు.
ఐతే గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ విశాఖకు రావడంలో కూటమి ప్రభుత్వ ఘనతేమీ లేదని.. ఆ క్రెడిట్ అంతా తమదే అని మాత్రం ఆయనన్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చినా.. ఆ స్టాండ్ మీద నిలవకుండా, మరోవైపు గూగుల్ డేటా సెంటర్ వల్ల పైసా ప్రయోజనం లేదన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు జగన్ వ్యాఖ్యలతో వాళ్ల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.