hyderabadupdates.com Gallery KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్ post thumbnail image

KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే కాదు… హైదరాబాద్‌ ప్రజలు సైతం చేతుల్లో పైసలు ఆడక పరేషాన్‌లో పడ్డారని పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యవస్థ కుప్పకూలిందని, అసమర్థ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.
KCR Key Comments
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ (KCR) అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌ అలీ, సునీతా లక్ష్మారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం తీరుతెన్నులపై కేసీఆర్‌కు పార్టీ ఇన్‌ఛార్జులు నివేదించారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌ (KCR) మాట్లాడుతూ… ‘‘కాంగ్రెస్‌ (Congress) అలవికాని హామీలిచ్చి అమలు చేయడంలేదని, నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న సమయంలోనే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వచ్చింది. ప్రజలు విజ్ఞులు. చాలా స్పష్టతతో ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుపును ఎప్పుడో ఖరారు చేశారు. భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు చేయాల్సిందల్లా… అత్యధిక మెజారిటీ కోసం ప్రజలతో కలిసి పనిచేయడమే. ఇంటింటికీ వెళ్లి.. సర్కారు వైఫల్యాల గురించి కాంగ్రెస్‌ (Congress) బాకీ కార్డు చూపిస్తూ వివరించి చెప్పండి’’ అని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.
KCR – బీఆర్ఎస్ హయాంలో మానవీయ కోణంలో పథకాల అమలు
‘‘భారత రాష్ట్ర సమితి హయాంలో ప్రతి పథకాన్ని మానవీయ కోణంలో రూపొందించి అమలు చేశాం. కేసీఆర్‌ (KCR) కిట్‌ను, గొర్రెలు, చేపల పంపిణీ పథకాలను తీసుకొచ్చాం. మిషన్‌ భగీరథ ద్వారా మారుమూల గ్రామాలకు, తండాలకు కూడా తాగునీరు అందించాం. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి బస్తీవాసులకు వైద్యాన్ని చేరువ చేశాం. రెసిడెన్షియల్‌ స్కూళ్లు స్థాపించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్య అందించాం. మహిళా డిగ్రీ కాలేజీలు నెలకొల్పాం. కరోనా కష్టకాలంలోనూ పింఛన్లు ఇచ్చాం.
పెద్దనోట్ల రద్దు వంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. అన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే.. ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఏటా 10-15 శాతం పెరగాల్సిన ఆదాయం ఇప్పుడు కాంగ్రెస్‌ (Congress) పాలన వల్ల మైనస్‌లోకి వెళ్లిపోతోంది. పదేళ్లపాటు అన్ని రంగాలు పురోభివృద్ధి సాధిస్తే… ఇప్పుడు అవి నిర్వీర్యమవడం బాధాకరంగా ఉంది. గడిచిన రెండేళ్లలో ఆర్థిక వృద్ధిలో తెలంగాణ చివరి స్థానంలో ఉన్నట్లు నివేదికలు వస్తోంటే… కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. భారత రాష్ట్ర సమితి హయాంలో తెచ్చిన పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో కాంగ్రెస్‌ను నిలదీయాలి.
హైడ్రాతో నిలువ నీడ కోల్పోయిన పేదలు
బీఆర్ఎస్ (BRS) హయాంలో హైదరాబాద్‌లో నిత్యం నాణ్యమైన కరెంటు అందించగా… కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చింది. తాగునీటి సమస్య పెరిగింది. కనుమరుగైన వాటర్‌ ట్యాంకర్లు తిరిగివస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాలనలో రియల్‌ ఎస్టేట్‌లో ముంబయి, దిల్లీలతో తెలంగాణ పోటీపడే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతూ… హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కుప్పకూల్చారు. నిరుపేదలు ఆవాసాలు కోల్పోయి వీధిన పడ్డారు. వారికి నిలువ నీడ లేకుండా చేశారు. రియల్‌ ఎస్టేల్‌ రంగంలో పనిచేసే లక్షల మంది జీవితాలు ఆగమయ్యాయి. ఈ అంశంపై కోపంగా ఉన్న ప్రజలకు… అండగా నిలుస్తామని పార్టీ నాయకులు భరోసా కల్పించాలి. అన్ని డివిజన్లలో భారత రాష్ట్ర సమితికు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చివరి నిమిషం వరకూ ప్రతి ఓటూ పోలయ్యేలా ప్రయత్నించాలి. ప్రజలకు అర్థమయ్యేలా…. వారి భాషలో మాట్లాడుతూ… వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగాలి.
కాంగ్రెస్‌ తరఫున జూబ్లీహిల్స్‌ ప్రచారంలో రౌడీషీటర్లే పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పొరపాటున గెలిస్తే… జూబ్లీహిల్స్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచించాలి. ఈ విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. మాగంటి గోపీనాథ్‌ అందించిన సేవలను గుర్తుచేయాలి. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రజలు… మళ్లీ కాంగ్రెస్‌ బల్లెంను పక్కలోకి తెచ్చుకుంటారా? ఇక భాజపా ఎక్కడుందని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలకు ఆ పార్టీ గురించి ఆలోచనే లేదు. కచ్చితంగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఘన విజయం సాధిస్తారు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ మాఫియా రాజ్యం – కేటీఆర్
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం అవినీతి, భూఆక్రమణలు, సెటిల్మెంట్లకు కేంద్రంగా మారిపోయిందంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యంగా మారిందని, సీఎం రూ.వేల కోట్లు పోగేసుకుంటుంటే తాము వందల కోట్లయినా సంపాదించొద్దా… అంటూ మంత్రులు పోటీ పడుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త సల్మాన్‌ఖాన్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కేసీఆర్‌లాంటి సెక్యులర్‌ నేత ఎవరూ లేరని ప్రశంసించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఇదేతీరు కొనసాగుతోందన్నారు. మంత్రుల మధ్య అవినీతి సొమ్ముల పంపకాలు, టెండర్ల రిగ్గింగ్‌ వంటివి.. కాంగ్రెస్‌ ఇంటి పంచాయితీలుగా మారాయన్నారు. ఇంత బహిరంగంగా దేశచరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. పొంగులేటి తమ టెండర్లలో తలదూర్చారని ఓ మంత్రి కుమార్తె ఆరోపించారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఆయన అనుచరుడు రోహిన్‌రెడ్డి ఓ పారిశ్రామికవేత్త నెత్తిన గన్నుపెట్టి బెదిరించారంటూ ఆమె చేసిన ఆరోపణలపై రేవంత్‌రెడ్డికి సిగ్గుంటే స్పందించాలన్నారు. మంత్రి కూతురు ఆరోపణలుచేస్తే ఆ మంత్రిని తొలగించలేని బలహీనమైన ఇలాంటి సీఎంను ఇప్పటివరకు చూడలేదన్నారు. దావూద్‌ ఇబ్రహీంలాంటి ఈ సీఎంను తరిమేస్తేనే తెలంగాణకు పట్టిన శని పోతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. భాగస్వాములైతే, గతంలో మాదిరిగానే జైలుకు వెళ్లాల్సివస్తుందని అధికారులను హెచ్చరించారు.
Also Read : Bus Accident: కర్నూలులో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్దం ! 20 మందికి పైగా మృతి !
The post KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Victory Venkatesh Joins Megastar Chiranjeevi’s “Mana Shankara Varaprasad Garu” ShootVictory Venkatesh Joins Megastar Chiranjeevi’s “Mana Shankara Varaprasad Garu” Shoot

The buzz around Megastar Chiranjeevi’s upcoming film “Mana Shankara Varaprasad Garu” continues to grow as the project races ahead under the direction of Anil Ravipudi. Ever since its announcement, the

Nalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టుNalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టు

Nalgonda Police : అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మేర మోసానికి పాల్పడిన నిందితుడిని నల్గొండ (Nalgonda Police) జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు విలువైన కార్లు, ఆస్తి పత్రాలు, బాధితులకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు,