ఆపద రావడం ఒక ఎత్తు.. ఆపద అనంతరం ప్రభుత్వాలు, నాయకులు, వ్యక్తులు, అధికారులు వ్యవహరించే తీరు మరొక ఎత్తు. తాజాగా కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వేమూరి కావేరీ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వారిని గుర్తించడానికి కూడా పరిస్థితి మారిపోయింది. ఎక్కడెక్కడి వారు బెన్గలూరుకు వెళ్తున్నారో తెలియదు. వీరిలో కేవలం ఆరుగురు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారు. మరో 8 మంది తెలంగాణ వారు. ఇంకొందరు బెన్గలూరు, ఒడిసా, బీహార్‌కు చెందినవారు కూడా ఉన్నారు.
ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు, ఆయా దేహాలను అప్పగించడం, వారికి సహాయం అందించడం, సమాచారం చేరవేయడం వంటివి ప్రభుత్వాల కీలక కర్తవ్యం. కేవలం పరిహారం ప్రకటించడం మాత్రమే కాకుండా, బాధిత కుటుంబాలకు మేమున్నామంటూ ఆదుకోవడం అత్యంత ముఖ్యం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరికకు బాధిత కుటుంబాల నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అందుతున్నాయి. మొత్తం 19 మంది మరణించగా, వీరిలో 18 మంది కుటుంబ సభ్యులను ప్రభుత్వం గుర్తించింది. DN A తప్ప, మరో విధంగా గుర్తించలేని పరిస్థితి ఏర్పడడంతో అప్పటికప్పుడు మంగళగిరిలో ప్రత్యేకంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేసి (ఇప్పటికే ఉన్నదానిలో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు) పరీక్షలు పూర్తి చేశారు.
వాస్తవ అంచనాప్రకారం సోమవారం మధ్యాహ్నానికి కానీ ఏమీ చెప్పలేమని అధికారులు తెలిపారు. కానీ, సీఎం చంద్రబాబు చొరవతో హుటాహుటిన కదిలారు. మధ్యలో సెలవులు వచ్చినప్పటికీ తీసుకోరాదని, సెలవులో ఉన్న సిబ్బందిని కూడా రమ్మనాలి అని ఆదేశించి, రెవెన్యూ, పోలీస్, వైద్య సిబ్బంది అహరాహం శ్రమించారు. ఒకవైపు బాధిత కుటుంబాలకు దిశానిర్దేశం చేసి వారిని ఊరాడిస్తూ, మరోవైపు DN A పరీక్షలను వేగంగా పూర్తి చేసి, బాధిత కుటుంబాలకు ఆదివారం సాయంత్రంనాటికే (షెడ్యూల్ కంటే ముందే) 18 మృత దేహాలను అందించారు.
అంతేకాదు, ఆయా మృత దేహాలను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం బెంగలూరు సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేసింది. అదేసమయంలో ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రూ.5 లక్షల చెక్కులను కూడా వెంటనే బాధిత కుటుంబాలకు ఇచ్చారు. అలాగే, మృతులకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా బాధితులు ఎక్కడా తిరగకుండా అప్పటికప్పుడు ఏర్పాటు చేసి, వారికి అందజేశారు.
మొత్తంగా, ప్రాణాలు తీసుకురాలేకపోయినా, బాధిత కుటుంబాలకు అధికారులు, మంత్రులు, ప్రభుత్వం తోడుగా ఉండి, చివరి నిమిషం వరకు వారిని ఫాలో చేసిన తీరికకు అభినందనలు, కృతజ్ఞతలు దక్కుతున్నాయి. మరోవైపు, ఖర్చులు స్థానిక కలెక్టర్లు అందజేయాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.