హుద్ హుద్ తుఫాను గుర్తుందా? విశాఖను ఈ తుఫాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే కదా! 2015లో వచ్చిన హుద్ హుద్ తుఫాను తీవ్రస్థాయిలో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలను దెబ్బతీసింది. ముఖ్యంగా విశాఖను చాలా తీవ్రంగా దెబ్బతీసింది.
అయితే ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండేలా ప్రత్యేక స్ట్రాటజీ అనుసరించారు. దీంతో తీవ్రస్థాయిలో గాలులు, తుఫాను వర్షాలు వచ్చినా ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రభుత్వం కాపాడింది. అయితే పెద్ద ఎత్తున ఆస్తులకు మాత్రం నష్టం వచ్చింది.
విపత్తు వచ్చినప్పుడు సహజంగా ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటి తుఫాను తీవ్రతను అడ్డుకోలేకపోయినా ప్రాణ నష్టం జరగకుండా సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. విశాఖకు కొంత దూరంలో ఆయన బస్సులో బస చేశారు. నిరంతరం సమీక్షించారు. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అక్కడే మోహరించారు.
మంత్రులకు కూడా వేరే పనులు అప్పగించకుండా తుఫాను బాధ్యతలే ఇచ్చారు. ఇలా ఒక పద్ధతి ప్రకారం 5 రోజులు శ్రమించారు. దీంతో ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్త పడ్డారు.
అంతేకాదు తుఫాను మిగిల్చిన ఆస్తి నష్టం నుంచికూడా అత్యంత వేగంగా బయటపడేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. కైలాసగిరి సహా ఆర్కే బీచ్ రోడ్డులు ధ్వంసమైనప్పుడు వాటిని కేవలం వారం రోజుల్లోనే పునరుద్ధరించారు. చెట్లు కూలి, కరెంటు తీగలు తెగిపడిన ఘటనలను గంటల వ్యవధిలో పరిష్కరించారు.
ఇలా ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగి విశాఖ ప్రజలకు స్వాంతన చేకూర్చారు. ఇప్పుడు వచ్చిన మొంథా తుఫాను విషయంలోనూ సీఎం చంద్రబాబు అదే వ్యూహం అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రులను, ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు.
మంత్రుల బాధ్యతలను సీఎం చంద్రబాబు స్వయంగా చూస్తుండగా ఎమ్మెల్యేల బాధ్యతను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. వారిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.
అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే హుద్ హుద్ తుఫాను విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పరిమితం అయింది. కానీ ఇప్పుడు మొంథా మాత్రం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న సుమారు 10 జిల్లాల్లో ప్రభావం చూపుతోంది.
అయినప్పటికీ హుద్ హుద్ సమయంలో అనుసరించిన వ్యూహంతో చంద్రబాబు దీని నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా బయటపడేలా వ్యవహరిస్తున్నారు.