సినీ రంగానికి సంబంధించిన కీలక అంశం కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలైనా టికెట్ ధరలు పెంచుకునే విషయం. ఇది ఎప్పటికప్పుడు సినీ రంగానికి కొంత ఇబ్బందికరంగానే ఉంది. టికెట్ ధరల పెంపు కోరడం, ప్రభుత్వాల నుంచి ఒక్కోసారి అనుకూలంగా, కొన్ని సార్లు వ్యతిరేకంగా నిర్ణయాలు రావడం తెలిసిందే.
ఈ విషయంలో ఏపీలో అయితే వైసీపీ హయాంలో సినీ రంగ ప్రముఖులు సర్కారును బ్రతిమాలుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక కొంత బెటర్ పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ సర్కారు విషయానికి వస్తే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు కూడా కొంత మేరకు ఉదారంగానే ఈ విషయంలో స్పందిస్తోంది. అయినప్పటికీ కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
“దీనికి నేను ఓ పరిష్కారం చూపించాలని భావిస్తున్నాను. మీరు టికెట్ ధరలు పెంచుకోవాలని భావిస్తున్నారు. పెంచుకునేందుకూ అనుమతి ఇస్తాం. కానీ మీరు అలా టికెట్ ధరలు పెంచుకోగా వచ్చిన సొమ్ములో 20 శాతాన్ని ఇదే ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాలి. ఈ నిబంధనను పాటించే వారికే ఇక నుంచి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తాం” అని తేల్చి చెప్పారు.
తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఇతర యూనియన్ల ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సభకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టికెట్ ధరల పెంపు ప్రస్తావన తీసుకువచ్చారు.
ఇదేసమయంలో కార్మికులు పడుతున్న ఇబ్బందులు కూడా ప్రస్తావించారు. సినీ పరిశ్రమలో అనేక మంది ఉన్నారన్న ఆయన తెరమీద మాత్రం హీరో హీరోయిన్లు మాత్రమే కనిపిస్తారని అన్నారు. కానీ తెరవెనుక శ్రమిస్తున్న కార్మికులు వందల సంఖ్యలో ఉన్నారని చెప్పారు. వీరిలో లైట్ మెన్, కెమెరా టెక్నీషియన్లు, స్పాట్ బాయ్స్, మేకప్ మెన్ వంటి ఎంతో మంది ఉన్నారని చెప్పారు.
అయితే కొత్త సినిమా విడుదలైనప్పుడు నిర్మాతలు, దర్శకులు ప్రభుత్వాల వద్దకు వచ్చి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరుతున్నారని సీఎం చెప్పారు. “అనుమతి ఇస్తే ఏం జరుగుతోంది? వచ్చిన లాభాలను మీరే తీసుకుంటున్నారు. మరి కార్మికుల సంగతేంటి? అందుకే ఈ విషయంలో అందరూ మారాలి. ఇక నుంచి టికెట్ రేట్ల పెంపునకు అనుమతి (జీవో) ఇవ్వాలంటే పెరిగిన రేట్‌లో 20 శాతం ఖచ్చితంగా కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలి” అని తేల్చి చెప్పారు.
ఇలా ఇవ్వని వారికి అనుమతి ఇవ్వబోమన్నారు. అంతేకాదు దరఖాస్తులోనే ఈ విషయాన్ని స్పష్టం చేయాలని తాము కూడా జీవోలో పేర్కొంటామని అన్నారు. మరి దీనిపై నిర్మాతల మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి.