ఆరు గంటలకు దగ్గరగా ఉన్న ఫుటేజీని మూడు గంటల నలభై మూడు నిమిషాలకు కుదించడమంటే ఎడిటర్ కది చాలా పెద్ద సవాల్. ఇది చాలా సినిమాలకు జరిగే అనుభవమే అయినా పార్ట్ 1, 2 రెండు భాగాలు బ్లాక్ బస్టరైన ఒక ప్యాన్ ఇండియా మూవీకి చేయడం మాములు రిస్క్ కాదు. అయినా సరే రాజమౌళి దానికి సిద్ధపడ్డారు. బాహుబలి ఎపిక్ పేరుతో టూ పార్ట్స్ ని సింగల్ వెర్షన్ గా మార్చి ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ నుంచి ఐస్ దాకా అన్ని ఫార్మాట్స్ లో రీ రిలీజ్ కు రెడీ చేశారు. అయితే అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఉన్న పెద్ద సందేహం అసలేమేం లేపేసి ఉంటారాని. దానికి సమాధానం దొరికింది.
ప్రభాస్, రానా, జక్కన్నలు పాల్గొన్న ఒక సరదా ఇంటర్వ్యూలో ఈ కత్తిరింపుల ప్రస్తావన వచ్చింది. తమన్నా పోషించిన అవంతిక లవ్ ట్రాక్, యువత మనసులు కొల్లగొట్టిన పచ్చబొట్టేసిన పాట, కన్నా నిదురించరా సాంగ్, ఇరుక్కుపో గీతం, యుద్ధ సన్నివేశాలను కొన్ని తీసేయడం లాంటివి ఎపిక్ లో జరిగిన కీలక మార్పులు. ఫస్ట్ హాఫ్ ఒక గంట నలభై నిమిషాలే ఉండబోతుండగా సెకండాఫ్ మాత్రం రెండు గంటలకు పైగానే ఎంటర్ టైన్ చేయబోతోంది. అంటే బిగినింగ్ కన్నా ఎక్కువ ఫోకస్ కంక్లూజన్ మీద పెట్టారన్న మాట. శివుడు క్యారెక్టర్ ఎలివేషన్లు, భల్లలాదేవా కీలక సన్నివేశాలు కోతకు గురి కాలేదనేరీతిలో రాజమౌళి సంకేతమిచ్చారు.
సో బాహుబలి ఎపిక్ చూసేటప్పుడు చాలా సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయి. ముందు రోజు రాత్రి ప్రీమియర్లతో హడావిడి మొదలుపెట్టబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. మొంతా తుఫాను వల్ల ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం, వరద వల్ల కొంచెం హైప్ తగ్గినట్టు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే మొదటి రోజు పెద్ద ఎత్తున షోలతో బాహుబలి ఎపిక్ భారీ ఓపెనింగ్స్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త రిలీజ్ మాస్ జాతరకు ధీటుగా దీనికి బుకింగ్స్ జరుగుతూ ఉండటం గమనించాల్సిన విషయం.