హఠాత్తుగా అరుంధతి హిందీ రీమేక్ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. శ్రీలీల టైటిల్ రోల్ లో నిర్మాత అల్లు అరవింద్ దీన్ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారని దాని సారాంశం. ఇలాంటివి హ్యాండిల్ చేయడంలో మంచి పనితనం చూపించే దర్శకుడు మోహన్ రాజాకు ఈ బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్టు పేర్కొంటున్నారు. అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చిందోనని అనుష్క ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. ఎందుకంటే హిందీ ఆడియన్స్ తో సహా అరుంధతిని చూసిన ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. డబ్బింగ్, స్ట్రెయిట్, ఓటిటి, శాటిలైట్ తదితర రూపాల్లోలెక్కలేనన్నిసార్లు జనాల ముందుకు వచ్చింది.
అలాంటప్పుడు రెండు దశాబ్దాల తర్వాత అరుంధతిని మళ్ళీ తీయాలనుకోవడం అనవసరమైన సాహసమనేది మెజారిటీ మూవీ లవర్స్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. పైగా శ్రీలీల ఇంకా బాలీవుడ్ లో సెటిల్ కాలేదు. రెండు క్రేజీ సినిమాలు చేస్తోంది కానీ అవింకా రిలీజ్ కాలేదు. పైగా తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇంకా వేచి చూడాలి. గద్వాల్ రాణిగా అనుష్కలోని దర్పం, హుందాతనం ఇప్పుడు బాగా సన్నబడిన శ్రీలీలకు అంతగా సూట్ అవ్వదనే కామెంట్ ని కొట్టి పారేయలేం. ఆ మాటకొస్తే ఇది వర్కౌట్ అవుతుందనుకుంటే అసలు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎప్పుడో దీన్ని హిందీలో రీమేక్ చేసి ఉండేవారు.
ప్రస్తావించాల్సిన రిస్క్ మరొకటి ఉంది. మన దగ్గర భీకరంగా ఆడేసిన సినిమాలు హిందీకి వచ్చేటప్పటికీ చీదేస్తున్నాయి. అల వైకుంఠపురములో, జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్, గద్దలకొండ గణేష్ లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అంతెందుకు భాగమతి రీమేక్ పట్టుమని వారం రోజులు కూడా ఆడలేదు. అలాంటప్పుడు అరుంధతి ఆలోచన చేయడం సాహసమే. అయినా ఇది గాసిప్పా లేక నిజంగానే ప్లాన్ చేస్తున్నారా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. మాస్ జాతర ప్రమోషన్ ఇంటర్వ్యూలు పూర్తయ్యాక ఈ న్యూస్ బయటికి వచ్చింది కానీ లేదంటే శ్రీలీల నోటి వెంటే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేదేమో.