మంత్రి పదవులు ఆశించిన వారి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ నేతలు.. రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే.. వివిధ కారణాలతో వారికి అవకాశం చిక్కలేదు. నిజానికి 18 మంది వరకు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. కానీ.. పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించ లేదు. తాజాగా చేసిన విస్తరణలోనూ ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారు.
దీంతో మంత్రివర్గంలో చోటు కోసం.. కొన్నాళ్లుగా ప్రయత్నించడంతోపాటు.. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా హామీపొందారన్న చర్చ ఉన్న ఇద్దరు నాయకులకు.. కూడా అవకాశం చిక్కలేదు. దీంతో తాజాగా వారిలో ఒకరికి కార్పొరేషన్ పదవిని.. మరొకరికి కొత్తగా సలహారు పోస్టును క్రియేట్ చేసి.. మంత్రులకు ఉండే అన్ని సదుపాయాలను కల్పించారు. అదేవిధంగా భద్రత నుంచి కాన్వాయ్ వరకు కూడా సౌకర్యాలు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరు వారు?
1) మంచిర్యాల నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు. ఈయనను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. మంత్రులకు కల్పించేకేబినెట్ హోదాతో పాటు.. కాన్వాయ్, భద్రతను కూడా కల్పిస్తారు. అదేవిధంగా వేతనాలను కూడా మంత్రులకు ఇచ్చే వేతనాలనే ఇస్తారు.
2) పి. సుదర్శన్ రెడ్డి: ఈయన బోధన్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. సీనియర్ మోస్ట్ నాయకుడు. గతంలోనూ మంత్రిగా పనిచేశారు. ఈయన కూడా పార్టీ విజయం దక్కించుకున్నాక.. మంత్రి వర్గంలో సీటు కోసం ప్రయత్నించారు. తాజాగా అయినా.. దక్కుతుందని కొన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. అయితే.. సీటు దక్కలేదు. దీంతో సర్కారుకు సలహాదారుగా నియమించారు. మంత్రులకు వర్తించే అన్ని సౌకర్యాలతో పాటు కాన్వాయ్, భద్రత లభిస్తుంది. అంతేకాదు.. మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా వచ్చేందుకు అవకాశం కల్పించారు.