సెప్టెంబరు నెలాఖర్లో తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాటలకందని ఈ విషాదం విషయమై తప్పు ఎవరిదే అనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. టీవీకే అధినేత విజయే దీనికి బాధ్యత వహించాలంటూ అధికార డీఎంకే దాడి చేసింది. టీవీకేయేమో ప్రభుత్వానిదే బాధ్యత అని, దీని వెనుక కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేసింది.
సినీ జనాలు కొందరు విజయ్‌కి మద్దతుగా మాట్లాడారు. కొందరు విజయ్‌ని తప్పుబట్టారు. మిగతా వాళ్లు మౌనం వహించారు. ఐతే సినీ రంగంలో చాలా ఏళ్లుగా విజయ్‌కి ప్రధాన పోటీదారుగా ఉన్న అజిత్ ఈ అంశంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించడం గమనార్హం. మీడియాకు దూరంగా ఉండే అజిత్.. లేక లేక ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కరూర్ విషాదం గురించి స్పందించాడు.
విజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా అతడికి మద్దతుగా నిలిచాడు అజిత్. ఈ విషాదానికి ఏ ఒక్క వ్యక్తినో బాధ్యుడిని చేయడం తప్పని అజిత్ అభిప్రాయపడ్డాడు. దీనికి ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలని అతనన్నాడు. సినీ తారలను, రాజకీయ నాయకులను చూసేందుకు భారీగా జనం గుమికూడడం పెరిగిపోతోందని.. దీని మీద మోజు తగ్గించుకోవాలని అజిత్ అన్నాడు. ఈ కార్యక్రమాలను సరిగా నిర్వహించలేకపోతున్నారని, కాబట్టి వీటిని నియంత్రించాలని అజిత్ అన్నాడు.
సినీ నటులుగా తాము ఎంతో కష్టపడేది జనాల నుంచి ప్రేమ పొందడానికే అని.. కానీ ఆ ప్రేమను చూపించే పద్ధతి ఇది కాదని అజిత్ అన్నాడు. సెలబ్రెటీలను చూడడానికి జనం ఎగబడడం తగ్గించాలని.. ఈ విషయంలో మీడియా అందరికంటే ఎక్కువ బాధ్యతగా ఉండాలని.. వీటి పట్ల జనాల్లో ఆసక్తి పెంచడం తగ్గించాలని అజిత్ అభిప్రాయపడ్డాడు. కరూర్ లాంటి ఘటనలకు అందరం బాధ్యత వహించి.. ఇకపై ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో అది చేయాలని అజిత్ సూచించాడు.