తనపై కొందరు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేశారని కల్వకుంట్ల కవిత కొద్ది రోజుల క్రితం చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన సోదరుడు కేటీఆర్ కూడా తనను పట్టించుకోలేదని, చాలా రోజులు తనతో మాట్లాడలేదని ఆమె చేసిన ఆరోపణలు కేసీఆర్, కేటీఆర్ లను ఇరుకున పడేశాయి. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మాగంటి సునీత చెల్లిని గెలిపించాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ కామెంట్ కు కౌంటర్ ఇచ్చిన రేవంత్..కేటీఆర్ పై సెటైర్లు వేశారు. సొంత చెల్లికి అన్నం పెట్టలేదు..చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తానన్నడంటం అంటూ చురకలంటించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేశారని, ఆమెను కేటీఆర్ ఏడిపించారని అన్నారు.
సొంతింటి ఆడబిడ్డను మంచిగ చూసుకోని కేటీఆర్…సునీతమ్మను, అక్కచెల్లెళ్లను ఎలా బాగా చూసుకుంటారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు తాను అడగడం లేదని, కవిత అడుగుతున్నారని, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఉందని చెప్పారు. ఏ ఆడబిడ్డయినా పుట్టింటి మీద ఆరోపణలు చేయదని, కానీ, కవితను ఎంత బాధపెడితే, కష్టాలు పెడితే ఇలా వారిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇలా కేటీఆర్ పై కవిత విమర్శలను రేవంత్ వాడుకోవడం..కవిత విషయంలో రేవంత్ ను కేటీఆర్ కౌంటర్ చేసే పరిస్థితి లేకపోవడం బీఆర్ఎస్ ను ఇరుకున పడేసింది.