Narendra Modi : దేశం, ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. దేశంలో మావోయిస్టు ప్రభావితజిల్లాల సంఖ్య గత 11 ఏళ్లలో 125 నుంచి మూడుకు పరిమితం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. నవ రాయ్‌పూర్‌లో ఛత్తీ స్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు అయిన సందర్భంగా శనివారం నిర్వహించిన ‘ఛత్తీస్ గఢ్ రజత్ మహోత్సవ్’లో ఆయన పాల్గొన్నారు. ఈ ఐదు దశాబ్దాలుగా మావోయిస్టుల (Maoists) హింసతో నలిగిపోయిన ఈ రాష్ట్రం నేడు దాన్నుంచి విముక్తి చెందడం ఎంతో సంతృప్తినిచ్చే విషయమన్నారు.
PM Narendra Modi Key Comments on Maoists
మావోయిస్టు (Maoists) సిద్ధాంతం గిరిజన ప్రాంతాల్లో కనీస అవసరాలు కూడా తీరకుండా చేసిందన్నారు. ఏళ్లుగా గిరిజన గ్రామాలకు రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ‘‘ఆఖరికి ఉన్నవాటిని కూడా బాంబులతో పేల్చివేశారు.. వైద్యులను, ఉపాధ్యాయులను చంపారు.. మరోవైపు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన వారు తాము ఏసీ గదుల్లో ఉంటూ.. మిమ్మల్ని పట్టించుకోలేదు.’’ అని ప్రధాని విమర్శించారు. కొద్ది నెలలుగా రూ.లక్షలు, కోట్ల రివార్డులు ఉన్నవారు సహా పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు. వారు నేడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి శాంతి బాట పట్టారని ఆయన తెలిపారు.
నవా రాయ్‌పుర్ అటల్ నగర్‌లో శాసనసభ నూతన భవనాన్ని ప్రారంభిస్తూ… వెనకబాటుతనానికి మారు పేరుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రస్తుతం అభివృద్ధి, భద్రత, స్థిరత్వానికి చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. ‘‘50 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు మావోయిస్టుల హింసతో సతమతమయ్యారు. రాజ్యాంగాన్ని చూపించేవారు సామాజిక న్యాయం పేరుతో మొసలికన్నీరు కారుస్తూ అన్యాయం చేశారు. స్వప్రయోజనాలను మాత్రమే చూసుకున్నారు’’ అంటూ విపక్ష కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. నవా రాయ్‌పుర్‌లో శాంతి శిఖర్ సెంటర్ ఫర్ స్పిరిచ్యువల్ అండ్ మెడిటేషన్ ఆఫ్ బ్రహ్మ కుమారీస్‌ను కూడా ప్రారంభించారు.
శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిని సందర్శించిన ప్రధాని
నవా రాయ్‌పుర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సందర్శించారు. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్న దాదాపు 2,500 మంది చిన్నారులతో మాట్లాడారు. ఆసుపత్రికి చేరుకున్న మోదీకి.. ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్’ వ్యవస్థాపకులు మధుసూదన్ సాయి స్వాగతం పలికారు. సత్యసాయి సంజీవని ఆసుపత్రుల ఛైర్మన్ శ్రీనివాసన్ ప్రధానికి చిత్రపటాన్ని అందజేశారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారులకు ప్రధాని ధ్రువపత్రాలు ఇచ్చారు. పుట్టపర్తి.. దాని చుట్టూ ఉన్న 400కు పైగా గ్రామాల్లో తాగునీటి సమస్యను సత్య సాయిబాబా ఎలా పరిష్కరించారో చిన్నారులకు మోదీ (Narendra Modi) వివరించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్, సత్యసాయి సంజీవని ఆసుపత్రి ట్రస్టీల్లో ఒకరైన సునీల్ గావస్కర్ కూడా పాల్గొన్నారు. ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్’లో భాగంగా శ్రీసత్యసాయి సంజీవిని ఆసుపత్రులు వందకు పైగా దేశాల్లో వైద్య, విద్య, పోషకాహర రంగాల్లో సేవలందిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత పీడియాట్రిక్ కార్డియాక్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్‌గా సంజీవిని ఆసుపత్రులు గుర్తింపు పొందాయి.
సాయుధ పోరాటం… విఫల మార్గం – మాజీ మావోయిస్ట్ మల్లోజుల
మావోయిస్టులు ఆయుధాలను వీడి… ప్రధాన స్రవంతిలో కలిసి పనిచేయాలని ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి ఓ వీడియో సందేశంలో కోరారు. ఎవరైనా ఆయుధాలను వీడాలని భావిస్తుంటే సంప్రదించాలంటూ తనది, లొంగిపోయిన మరో మావోయిస్టు నేత రూపేష్ ఫోన్ నంబర్లు ఇచ్చారు. సాయుధ పోరాటాన్ని ‘విఫల మార్గం’గా పేర్కొన్న ఆయన… మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచిపెట్టాలన్నారు. పరిస్థితులు మారాయని, ప్రజల మధ్య ఉండి చట్ట పరిధిలో పనిచేయాలని కోరారు. తమ చర్యల వల్ల ప్రజల నుంచి దూరమైన విషయాన్ని వారు గుర్తించాలని సూచించారు.
సాయుధ పోరాటాన్ని వీడడానికి సుముఖంగా లేని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మొండి వైఖరిని అవలంబిస్తోందని, మార్పులను గ్రహించడం లేదని విమర్శించారు. తాను, తనతో పాటు లొంగిపోయిన నక్సలైట్లను ద్రోహులంటూ విమర్శిస్తున్న వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. మేధావులు, ప్రజాస్వామ్య ప్రేమికులు, ముఖ్యంగా గిరిజనుల మేలు కోరేవారు తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని, మద్దతు ఇవ్వాలని కోరారు. గడ్చిరోలి పోలీసులు శనివారం పత్రికా ప్రకటనతో పాటు మల్లోజుల వీడియోను విడుదల చేశారు. ఆయన గత నెల 14న 60 మంది మావోయిస్టులతో, రూపేష్ అలియాస్ సతీష్ గత నెల 17న 200 మంది మావోయిస్టులతో కలిసి పోలీసులకు లొంగిపోయారు.
Also Read : AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
The post PM Narendra Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి – ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
PM Narendra Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి – ప్రధాని మోదీ
Categories: