వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఏపీ ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఉదయం 7 గంటలకు ఆయన ఇంటి నుంచి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన సోదరుడు జోగి రామును అరెస్టు చేశారు. అనంతరం.. ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కు తరలించి రాత్రి 10.30 గంటల వరకు విచారించారు. అనేక అంశాలపై వారిని వేర్వేరుగా ప్రశ్నించారు. నకిలీ మద్యం తయారీలో వారి పాత్ర సహా.. సొమ్ములు ఎవరెవరికి ఇచ్చారు? ఎంతెంత పంచుకున్నారు? అనే కోణంలో సుదీర్ఘ విచారణ చేశారు.
ఏపీలో అక్టోబరు 3వ తేదీన నకిలీ మద్యం వ్యవహారం తెరమీదికి వచ్చింది. అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి కేంద్రంగా ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు.. దాడులు చేశారు. కొందరిని అరెస్టు చేశారు.ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన తీగ ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉందని తెలుసుకుని అక్కడ కూడా దాడులు చేశారు. నకిలీ మద్యం సూత్రధారి అద్దేపల్లి జనార్ధన్‌రావును విదేశాల(దక్షిణాఫ్రికా) నుంచి రప్పించారు. ఇక, ఈ కేసులో టీడీపీ తంబళ్లపల్లి ఇంచార్జ్ జయచంద్రారెడ్డి పేరు కూడా ఉంది.
ప్రస్తుతం జయచంద్రారెడ్డి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలిస్తోంది. ఇదిలావుంటే.. పోలీసుల సమక్షంలో నోరు విప్పిన అద్దేపల్లి.. నకిలీ మద్యం తయారీని జోగి రమేషే ప్రోత్సహించారని చెప్పారు. వీడియోలు కూడా విడుదల చేశారు. అనంతరం.. పోలీసులు జోగి కేంద్రంగా చక్రం తిప్పారు. అనేక ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆయనను అరెస్టు చేయడంతోపాటు.. ఇంట్లో తనిఖీలు చేసి.. ఆయనతోపాటు.. కుమారుడు రాజీవ్, భార్య ఫోన్లను, ఇతర డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం.. హుటాహుటిన రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. దీనిని రాత్రం 12 గంటలకు విజయవాడ లోని స్థానిక కోర్టుకు సమర్పించారు. ఇక, అక్కడి నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఇరు పక్షాల మధ్య హోరా హోరీ వాదనలు జరిగాయి. జోగి తరఫున వైసీపీ లీగల్ టీం నేత, ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం.. జోగి సహా ఆయన సోదరుడు రాముకు రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్నీరికార్డు చేయించారు.