hyderabadupdates.com movies మెంటల్ మాస్ ప్లానింగ్ అంటే ఇది, జక్కన్నా మజాకా!

మెంటల్ మాస్ ప్లానింగ్ అంటే ఇది, జక్కన్నా మజాకా!

రాజమౌళి ఏది చేసినా కింగ్ సైజ్ లో ఉంటుందని చెప్పడానికి కొత్త ఉదాహరణలు పుట్టుకొస్తూనే ఉంటాయి. నవంబర్ 15 రామోజీ ఫిలిం సిటీలో ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ లాంచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం కాబోయే ఈ సంరంభానికి మహేష్ బాబు, జక్కన్నతో పాటు ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారధులు, హాలీవుడ్ ప్రతినిధులు, దేశవిదేశాల నుంచి జర్నలిస్టులు హాజరు కాబోతున్నారు. లక్షకు పైగా ఫ్యాన్స్ వస్తారనే అంచనాల మధ్య నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాసుల కోసం అభిమాన సంఘాల నుంచి డిమాండ్ మొదలయ్యిందని సమాచారం.

ఇదిలా ఉంచితే నిన్న జరిగిన వరల్డ్ కప్ విమెన్ ఫైనల్ మ్యాచ్ ని సుమారు ముప్పై కోట్లకు పైగానే వీక్షించినట్టు టీవీ వర్గాల కథనం. ఎస్ఎస్ఎంబి29 ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోలు మ్యాచ్ ఆసాంతం వందసార్లకు పైగానే టెలికాస్ట్ చేశారు. అద్భుతంగా జరిగిన మ్యాచ్ కావడంతో ఎవరూ ఛానల్, ఓటిటి యాప్ మార్చలేదు. మొత్తం వంద ఓవర్లు చూసిన క్రికెట్ ఫ్యాన్సే ఎక్కువ. సో మహేష్ జక్కన్న మూవీకి సంబంధించిన వేడుక ప్రకటన ఇలా రిపీట్ టెలికాస్ట్ చేయడం వల్ల జనాల్లో బలంగా ముద్రించుకుపోయింది. ఈవెంట్ హక్కులు కొన్న హాట్ స్టార్ లోనే ఫైనల్ మ్యాచ్ జరగడం రాజమౌళి బృందానికి గొప్పగా కలిసి వచ్చింది.

ఇదంతా కాకతాళీయంగా జరిగిందని అనుకోవడానికి లేదు. ఒకవేళ విమెన్స్ ఫైనల్ కి మనం చేరుకోకపోయి ఉంటే ఎస్ఎస్ఎంబి 29 యాడ్ ని మరో సమయంలో ఇంకో సందర్భంలో హైలైట్ చేయాల్సి వచ్చేది. ఎలాగూ ఇండియా ఆస్ట్రేలియా మెన్స్ టి20 మ్యాచులు ఇంకో రెండు బాకీ ఉన్నాయి. అవి కూడా హాట్ స్టార్ లోనే వస్తాయి. సో అప్పుడు వేసేవాళ్ళేమో. ఏదైతేనేం స్వకార్యం స్వామి కార్యం రెండూ జరిగిపోయిన తరహాలో రాజమౌళి కోరుకున్న మార్కెటింగ్ బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే నవంబర్ 15 దగ్గరయ్యే కొద్దీ జక్కన్న, కార్తికేయలు వేయబోయే పబ్లిసిటీ ప్లాన్లకు మతులు పోవడం ఖాయం.

Related Post