రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో ఉన్న సీఎం చంద్రబాబు మరో అద్భుతం సాధించారనే చెప్పాలి. ఆయన ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలోనూ పెట్టుబడులే కీలకంగా ఆయన చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో తాజాగా 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను దూసుకొచ్చారు. ఒక్క చిన్న ప్రయత్నంతో చంద్రబాబు ఈ విజయం సాధించారు. ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హిందూజా గ్రూప్ ముందుకు వచ్చింది. ఆ వెంటనే ఒప్పందాలు కూడా చేసుకుంది. దీంతో చంద్రబాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఏం జరిగింది?
లండన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మక సంస్థ హిందుజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. విశాఖ సహా పలు ప్రాంతాల్లో పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని, అందుబాటులో ఉన్న వనరులను కూడా కూలంకషంగా వారితో చర్చించారు. ఆయా అంశాలపై చంద్రబాబు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్న హిందుజా గ్రూప్ ప్రతినిధులు, వెంటనే రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దశల వారీగా ఈ పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. అదేసమయంలో ఈ నెలలో జరగనున్న విశాఖ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు కూడా వస్తామని హామీ ఇచ్చారు.
హిందూజా పెట్టుబడులు ఇలా:
విశాఖలో ఇప్పటికే ఉన్న హిందుజా విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని 1,600 మెగావాట్లు పెంచుతారు.
రాయలసీమ విద్యుత్ ప్లాంట్లలో పెట్టుబడులు పెట్టనున్నారు.
కృష్ణాజిల్లాలోని పారిశ్రామిక కారిడార్ మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో పెట్టుబడులు పెడతారు.
తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను హిందుజా ఏర్పాటు చేయనుంది.
గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకో సిస్టమ్ (హరిత రవాణా వ్యవస్థ) అభివృద్ధికి దోహదపడనున్నారు.