hyderabadupdates.com movies దీపికా పదుకొనే… ఇంకో గొడవ

దీపికా పదుకొనే… ఇంకో గొడవ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు ఈ మధ్య తరచుగా వివాదాల్లో నానుతోంది. వర్కింగ్ అవర్స్, మరి కొన్ని విషయాల్లో ఆమె పెడుతున్న కండిషన్లను తట్టుకోలేక ఆమెకు నిర్మాతలు టాటా చెప్పేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే బిడ్డకు తల్లి అయిన దీపిక.. పని వేళల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటోందని.. ఆ మేరకు నిర్మాతలకు షరతులు పెడుతోందని.. అలాగే పారితోషకం ఎక్కువ డిమాండ్ చేస్తోందని.. అదనపు ఖర్చుల మోత కూడా పెరిగిపోతోందనే చర్చ ఊపందుకుంది. 

దీని వల్ల స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి ఆమె తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. బాలీవుడ్లో కూడా చాలామంది ఆమె తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు సన్నిహితురాలైన దర్శకురాలు ఫరా ఖాన్.. ఒక టీవీ షోలో తనను ఉద్దేశించి పంచ్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. తాను పాల్గొన్న టీవీ షోకు దీపిక కూడా వస్తే ఎలా ఉంటుందనే విషయమై ఫరా ఖాన్ సరదాగా స్పందించింది. ‘‘ఆమె పని చేసేదే 8 గంటలు. ఇక ఈ షోకు ఎలా వస్తుంది? ఆమెకు అంత టైం ఎక్కడుంది’’ అని ఫరా వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూయర్ సినిమాలకు ఫరాతో కలిసి పని చేసిన దీపికకు ఆమెతో సన్నిహిత సంబంధాలే ఉండేవి. ఐతే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తన ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేసేలా ఈ కామెంట్ ఉండడంతో ఫరాను దీపిక సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య మాటలు కూడా ఆగిపోయాయని అంటున్నారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో ఫరా స్పందించింది. తాము చాన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవట్లేదన్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ టైంలోనే తమ మధ్య ఒక ఒప్పందం జరిగిందని.. పరస్పరం నేరుగా మాట్లాడుకోవాలని, సోషల్ మీడియాలో కాన్వర్జేషన్లు ఏమీ వద్దనుకున్నామని.. దీపికకు ఇలాంటివి నచ్చవని.. కాబట్టి ఒకరినొకరు అన్ ఫాలో కావడం లాంటిదేమీ లేదని.. ఇప్పుడు కొత్తగా తమ మధ్య వివాదం ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు.

Related Post