చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. గత నెల రోజుల్లో పలుమార్లు ఆయన పేరు హాట్ టాపిక్‌గా మారింది. లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో చేసిన ప్రసంగం వివాదాస్పదం కాగా.. దీపావళికి తన ఇంట్లో సినీ ప్రముఖులకు ఇచ్చిన భారీ పార్టీ సైతం చర్చనీయాంశం అయింది. లేటెస్ట్‌గా కే ర్యాంప్ సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ పేరెత్తకుండా తనను ఉద్దేశించి కౌంటర్లు వేయడం గత రెండు రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఇంతలోనే బండ్ల నిర్మాతగా బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇస్తున్నాడని.. మెగాస్టార్ చిరంజీవితో వరుసగా సినిమాలు తీయబోతున్నాడని ఒక హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది. తన ఇంట్లో దీపావళి పార్టీకి చిరును గౌరవించడం వెనుక కూడా ఇదే కారణమని కూడా ఓ ప్రచారం నడుస్తోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో బండ్ల స్పందించాడు. అందరికీ క్లారిటీ ఇస్తూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టాడు.
మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం:ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను అని ఆ పోస్టులో పేర్కొన్నాడు బండ్ల. బండ్ల గత నెల రోజులుగా బాగా యాక్టివ్ కావడం, దీపావళికి పెద్ద పార్టీ ఇవ్వడం చూసి కచ్చితంగా రీఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నాడనే అంతా అనుకున్నారు.
ఒకప్పుడు కమెడియన్‌గా చిన్న చిన్న పాత్రలు వేసిన బండ్ల.. తర్వాత నిర్మాత అవతారం ఎత్తి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, బాద్‌షా, టెంపర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీశాడు. చివరగా టెంపర్‌తో పెద్ద హిట్ కొట్టినప్పటికీ.. తర్వాత ప్రొడక్షన్‌కు దూరం అయిపోయాడు. మళ్లీ నిర్మాతగా సినిమాలు తీస్తాడని, తన కొడుకులను హీరోలుగా పరిచయం చేయబోతున్నాడని వార్తలు రాగా.. అలాంటిదేమీ లేదన్నట్లు గణేష్ క్లారిటీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.