ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఇడ్లి కడై తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది కానీ తెలుగులో డిజాస్టర్ మూటగట్టుకుంది. ఎమోషనల్ మూవీ కాబట్టి మన ప్రేక్షకులు ఆదరిస్తారనే అంచనా పూర్తిగా తప్పింది. ఒరిజినల్ వెర్షన్ కు డ్యూడ్ తో పోటీ లేకపోయి ఉంటే ఇంకా బెటర్ గా ఆడేదన్న కామెంట్ లో నిజం లేకపోలేదు. ఇటీవలే నాలుగు వారాల థియేటర్ విండో పూర్తి చేసుకుని ఇడ్లి కొట్టు నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. వారం తిరక్కుండానే 5 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇదే ప్లాట్ ఫామ్ లో ఉన్న ఓజి అయిదు మిలియన్లు చేరుకోవడానికి పదకొండు రోజులు పట్టడం గమనించాల్సిన విషయం.
యాక్షన్ ఎలిమెంట్స్, కమర్షియల్ హంగులు, ఎలివేషన్లు లేని ఒక పల్లెటూరి సినిమాకు ఇంత స్పందన రావడం అనూహ్యం. ఎందుకయ్యా అంటే భారీ శాతం ఆడియన్స్ దీన్ని థియేటర్లలో చూడలేదు. మిస్సయిన వాళ్ళే ఎక్కువ. అందులోనూ కంప్లీట్ ఫ్యామిలీ జానర్ కాబట్టి ఇంట్లో చూసేందుకు ప్రాధాన్యం ఇచ్చినవాళ్లు ఎక్కువ. దీంతో సహజంగానే వ్యూస్ ఎక్కువగా వచ్చాయి. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటంటే అయిదు దేశాల్లో ఇడ్లి కొట్టు నెంబర్ వన్ స్థానంలో ఉండగా నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. పదిహేను దేశాల్లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది.
ఇదంతా చిన్న ఘనత కాదు. ధనుష్ మార్కెట్ పరంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీ డిజిటల్ రేట్ పలుకుతుంది. అందులోనూ ఓజిని డామినేట్ చేసే స్థాయి అంటే ఆఫర్లు మరింత పెరుగుతాయి. సెంటిమెంట్ మరీ ఎక్కువైపోయి ల్యాగ్ అనిపించి మన జనాలు ఇడ్లి కొట్టుని వద్దన్నారు కానీ తమిళంలో చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. స్టార్ ఉంటే ఎంత హోమ్లీ కంటెంట్ అయినా జనాలు ఓటిటిలో చూస్తారని చెప్పడానికి ఇడ్లి కొట్టు ఉదాహరణగా నిలుస్తోంది. ధనుష్ మాత్రం ఈ రిజల్ట్ పట్ల పిచ్చ హ్యాపీగా ఉండుంటాడు. ఫ్యాన్స్ గురించి చెప్పేదేముంది.