ఎల్లుండి విడుదల కాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ మీద టీమ్ మాములు నమ్మకంగా లేదు. ఇవాళ నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్యుల మాటలు వింటే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయేలా ఉన్నాయి. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా చూశాక చాలా మంది రాత్రి నిద్రపోరని, గతంలో తమ చిత్రాలకు 1.5 నుంచి 3.5 దాకా రేటింగ్స్ ఇచ్చినవాళ్లు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కి తక్కువ ఇవ్వాలంటే ఆలోచిస్తారని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని సైతం చాలా కాన్ఫిడెన్స్ చూపించారు. ఇది హిట్ అయితే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఏకంగా హైదరాబాద్ లో ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చేశారు.
ఇలా ఒక్కొక్కరు తమ అనుభవాలు, జ్ఞాపకాలు, పడ్డ కష్టాలు అన్నీ పంచుకున్నారు. నిజానికి ఈ మూవీ మీద ఏమైనా బజ్ ఉందంటే రష్మిక మందన్ననే ప్రధాన కారణం. ట్రైలర్ కట్ చేసిన విధానం యూత్ లో అంచనాలు రేపింది. కథ పూర్తిగా రివీల్ చేయకకపోయినా ఏదో టిపికల్ బ్యాక్ డ్రాప్ తీసుకున్న వైనం కనిపించింది. ఆడియన్స్ షాక్ అవుతారని, దీని గురించే ఆలోచించే స్థాయిలో రాహుల్ రవీంద్రన్ సినిమాని తెరకెక్కించారని పని చేసినవాళ్లు ఓ రేంజ్ లో ఊరిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన దాంట్లో సగం ఉన్నా చాలు బాక్సాఫీస్ వద్ద ది గర్ల్ ఫ్రెండ్ దూసుకుపోవడం ఖాయం.
పేరుకు పోటీగా అరడజను సినిమాలు ఉన్నప్పటికీ ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటున్నది గర్ల్ ఫ్రెండ్ మాత్రమే. తర్వాత సుధీర్ బాబు జటాధర ఉంది కానీ అది కూడా బజ్ కోసం పోరాడుతున్నదే. రష్మిక మందన్నకు ఇటీవలే తమ్మ రూపంలో చేదు ఫలితం ఎదురయ్యింది. రిస్క్ తీసుకుని మరీ హారర్ జానర్ ట్రై చేస్తే ఆడియన్స్ ఆదరించలేదు. హిందీలో ఏదో కాస్త నెట్టుకొచ్చింది కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో సాలిడ్ కంబ్యాక్ కావాలని ఎదురు చూస్తోంది. విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ అయ్యాక విడుదలవుతున్న తెలుగు సినిమాగా కూడా గర్ల్ ఫ్రెండ్ తనకో స్పెషల్ మెమరీ కానుంది.