చదువు అబ్బలేకో లేదా చదివిన చదువుకు ఉద్యోగాలు ఎవడూ ఇవ్వకో కొందరు యువత సోషల్ మీడియాలో తమ భవిష్యత్తుని తాకట్టు పెట్టేస్తున్నారు. తప్పుడు ఐడిలు, ఫోటోలు పెట్టుకుని ఏం చేసినా ఏం మాట్లాడినా పట్టుకోలేరనే ధీమాతో లైన్ తప్పుతున్నారు. స్పేస్ పేరుతో ఓ యాభై వంద మంది కలిసి ఆడియో ద్వారా పరస్పరం మాట్లాడుకునే ట్రెండ్ ఈ మధ్య బాగా ఊపందుకుంది. ప్రమోషన్ల కోసం దర్శక నిర్మాతలు కూడా వీటిని ఫాలో అవుతుంటారు. కానీ ఫ్యాన్ వార్స్ పేరుతో కొన్ని బ్యాచులు చేస్తున్న అతి హద్దులు దాటిపోయి జుగుప్స, అసహ్యం కలిగేలా చేస్తున్నాయి. రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.
నిన్న జరిగిన ఒక స్పేస్ మీటింగ్ లో ఇక్కడ రాయడానికి వీలుపడని అసభ్య పదజాలంతో ఒక సమూహం సంభాషించుకున్న తీరు సమాజం తల దించుకునేలా ఉంది. అమ్మాయిలను, హీరోయిన్లు, సెలబ్రిటీలను సంబోధిస్తున్న తీరు గురించి ఎంత చెప్పుకున్నా మనకే సిగ్గుచేటు అనేలా ఉంది. గాయని చిన్మయి దీని పట్ల విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేయడంతో కమీషనర్ సజ్జనార్ నుంచి స్పందన వచ్చింది. కొందరిని ఆల్రెడీ ట్రేస్ చేయగా ట్విట్టర్ అకౌంట్లు డిలీట్ చేసి పారిపోయిన వాళ్ళను వెతికే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఎక్కడ ఉన్నా వాళ్ళను వదిలి పెట్టే ప్రసక్తే ఉండదు.
ఇప్పుడీ కేసుల వల్ల సదరు యువకుల భవిష్యత్తు మీద నల్ల ముద్ర పడుతుంది. ఎఫ్ఐఆర్ నమోదయ్యిందంటే విదేశీ అవకాశాలకు గండి పడుతుంది. ఉద్యోగాల సమయంలో ఇవే ప్రతిబంధకంగా మారతాయి. అంత దూరం ఆలోచించే విచక్షణ, తెలివి లేకపోవడంతో యువత ఈ సోషల్ మీడియా మత్తులో మునిగి తేలుతున్నారు. కనిపించకుండా తప్పు చేసినా టెక్నాలజీ పెరిగిపోయి ఐపి అడ్రెస్ ద్వారా పట్టుకునే అవకాశాలు ఇప్పుడు బాగా మెరుగయ్యాయి. ఇది మర్చిపోయి ఇలా ట్రోలింగులు, బూతుల పంచాంగాలతో కుర్రకారు సాధించేది ఏమి ఉండదు. తల్లితండ్రులను మానసిక క్షోభకు గురి చేయడం తప్ప దక్కేది శూన్యం.