అడివి శేష్ సినిమా అంటే అందులో బలమైన కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించగలిగాడు. కానీ తన సినిమాల కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. సినిమా మొదలుపెట్టడంలో.. పూర్తి చేయడంలో చాలా టైం తీసుకుంటాడు శేష్. 2022లో హిట్-2 చేశాక ఇప్పటిదాకా తన కొత్త సినిమా రిలీజ్ కాలేదు. కొంచెం గ్యాప్‌లో డెకాయిట్, గూఢచారి-2 సినిమాలను మొదలుపెట్టాడు కానీ.. అవి రెండూ ఆలస్యం అవుతున్నాయి.
ఈ ఏడాది క్రిస్మస్‌కు అనుకున్న ‘డెకాయిట్’ లేటెస్ట్‌గా మార్చి 19కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అదే రోజు ‘టాక్సిక్’ లాంటి భారీ చిత్రం రాబోతుండడంతో ఆ పోటీని శేష్ సినిమా తట్టుకోగలదా అన్న సందేహాలు కలిగాయి. ఈ పోటీ గురించి శేష్ తాజాగా స్పందించాడు. రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం కొత్తేమీ కాదని.. ఇందులో తప్పేమీ లేదని.. దీనికి బాక్సాఫీస్ వార్ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదని.. ఇదంతా మీడియా క్రియేట్ చేసిందే అని శేష్ అన్నాడు.
టాక్సిక్ సినిమాకు తామేమీ భయపడడం లేదని.. తాను ఎప్పుడూ సైలెంట్‌గానే వచ్చి హిట్ కొడుతుంటానని.. ప్రేక్షకులు ఊహించని విధంగా వాళ్లను ఆశ్చర్యపరచడం తనకు అలవాటని అతనన్నాడు. ఒకేసారి రెండు సినిమాలు రిలీజై హిట్టయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్న శేష్.. 2018లో యశ్ నటించిన ‘కేజీఎఫ్’, షారుఖ్ ఖాన్ ‘జీరో’ రెండూ ఒకేసారి విడుదలై సక్సెస్ అయ్యాయన్నాడు.
కానీ శేష్ చెప్పిన ఈ ఉదాహరణ తప్పు. ‘జీరో’ పెద్ద డిజాస్టర్ అయింది. ‘కేజీఎఫ్’ దెబ్బకు అస్సలు తాళలేకపోయింది’. లగాన్, గదర్ ఒకేసారి రిలీజై సక్సెస్ అయ్యాయంటూ అతను చెప్పిన మరో ఉదాహరణ మాత్రం కరెక్టే. ఇదిలా ఉంటే.. శేష్ మూవీ ఇప్పటికే రెండు మూడుసార్లు వాయిదా పడ్డ నేపథ్యంలో ఈసారైనా చెప్పిన డేటుకు వస్తుందా అనే సందేహాలున్నాయి. అదే సమయంలో ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ కూడా మారొచ్చనే అనుమానాలున్నాయి.