వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఒక ప్లానింగ్ ఉందా? అంటే… లేదన్న మాటే వినిపిస్తోంది. పార్టీ వర్గాల్లో ఈ మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇక ఇప్పుడు ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైంది. నాయకుడిగా ఆయన పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగాలి. దీనిలోనే అసలు లోపం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. సూత్రం లేని గాలిపటం మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారన్న వాదన మేధావుల చర్చల్లోనూ వినిపిస్తోంది.
ఏం చేస్తున్నారు..?
విపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ప్రజలకు చేరువ కావాలి. ఈ విషయంలో ఆయన తాత్సారం చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ప్రభావంతో అనేక మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తుఫాను ప్రభావం కొంత మేరకు తగ్గగానే సీఎం చంద్రబాబు వెంటనే బాపట్ల సహా పలు జిల్లాల్లో ఏరియల్ సర్వే చేసి రైతులను ఆదుకుంటామని చెప్పారు.
ఇక పంట నష్టంపై ఎన్యూమరేషన్ కూడా చేపట్టారు. ఈ క్రమంలో చాలా ఆలస్యంగా జగన్ పర్యటన పెట్టుకున్నారు. అది కూడా హంగామాను తలపించిందన్న విమర్శలు వచ్చాయి. వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో జగన్ వెంటనే స్పందించి ఉండాల్సిందని పార్టీ నాయకులు కూడా అభిప్రాయపడ్డారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చారని రైతులు కూడా పెదవి విరిచారు. గతంలో ఏడాది కిందట చనిపోయిన కార్యకర్తను పరామర్శించే యాత్ర వివాదానికి దారి తీసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఏం చేయాలి..?
ప్రజలకు అందుబాటులో ఉండేలా తాడేపల్లిలోనే ఆయన ప్రజాదర్బార్‌ను ప్లాన్ చేయాలని చాలా మంది నాయకులు కోరుతున్నారు. కానీ జగన్ ఇప్పటి వరకు ఈ విషయంపై దృష్టి పెట్టలేదు. కేవలం తన నియోజకవర్గం పులివెందులకు వెళ్లినప్పుడు మాత్రమే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో ఉండడంలేదు. దీని వల్ల వారిలో అవే అపోహలు కనిపిస్తున్నాయి.
సో… ఈ ప్లానింగ్ మార్చుకుని కొత్త ప్లానింగ్ అమలు చేస్తే జగన్ గ్రాఫ్ పెరుగుతుందని మేధావులు సూచిస్తున్నారు.