సమయానికి తగు మాటలాడడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా మాటల మాంత్రికులు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌లు ఈ విద్యలో ఆరితేరారు. ఎక్క డ తమకు అవకాశం ఉంటే.. అక్కడ తమ మాటలు మారుస్తూ ఉంటారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో కేటీఆర్.. ఇలాంటి ఆశ్చర్యకర వ్యాఖ్యలే చేశారు.
గతంలో పలు మార్లు విమర్శించిన టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన కొని యాడారు. “చంద్రబాబు విజన్‌ను మేం ఎప్పుడైనా తప్పుపట్టామా?” అని ప్రశ్నించారు. అంతేకాదు.. హైదరాబాద్ డెవల్‌మెంటులో ఆయన పాత్రలేదని నేను ఎప్పుడైనా చెప్పానా? అని అని కూడా అన్నారు. ఇక, మాగంటి సునీతకు టీడీపీ మద్దతు ఉంటుందా? అన్నదానిపై నిర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నేరుగా చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న కేటీఆర్.. ఉంటే ఉండొచ్చని అన్నారు.
ఈ సందర్భంగా ఎప్పుడో తన చిన్ననాటి సంగతులు గుర్తు చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర.. మాగంటి గోపీనాథ్.. అన్నగారి (ఎన్టీఆర్) దానవీర శూరకర్ణ కటౌట్‌ను ఏర్పాటు చేశారని.. దానిని ఇప్పటికీ మరిచి పోలేనని చెప్పారు. అన్నగారితో మాగంటి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నా.. తద్వారా.. టీడీపీ అభిమానులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయకనే చేశారన్నది రాజకీయ వర్గాల టాక్. అక్కడితో కూడా ఆగకుండా.. చంద్రబాబు మాగంటి కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని మేం అనుకోలేదన్నారు.
అయితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ తటస్థంగానే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. “బీజేపీతో టీడీపీకి పొత్తు ఉన్నా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే.. మాగంటికి ఆ పార్టీ మద్దతుఇస్తోందని కొందరు చెబుతున్నారు. ఏమున్నా… మాకు ఏం కాదు” అని కేటీఆర్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి జూబ్లీహిల్స్ లో టీడీపీ హవా అయితే.. ఉందని ఒప్పుకొన్నారు. కానీ.. ఈ ఎన్నికలో టీడీపీ ఎక్కడా కనిపించడం లేదు. చివరి నిముషంలో ఎలాంటి చర్చ సాగుతుందో చూడాలి.