ఇప్పుడంటే ప్రపంచవ్యాప్తంగా బోలెడంత మంది పాప్ సింగర్స్ ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. కానీ ఓ నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. ప్రపంచమంతా ఒక సింగర్ పేరెత్తితే చాలు వెర్రెత్తిపోయేది. టీనేజీలోనే ప్రపంచ సంగీత ప్రియులందరినీ ఊపేస్తూ అంతకుముందు, ఆ తర్వాత ఎవ్వరికీ సాధ్యం కాని ఫాలోయింగ్‌ను సంపాదించిన ఆ లెజెండరీ మ్యూజిక్ ఆర్టిస్టే మైకేల్ జాక్సన్. సింగర్‌గా, డ్యాన్సర్‌గా, మ్యుజీషియన్‌గా అతను ఆవిష్కరించిన అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సంగీత ప్రపంచం తన నుంచి ఇంకా ఎంతో ఆశిస్తున్న సమయంలో, 2009లో 51 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తాడు మైకేల్. అతను చనిపోయిన వెంటనే ‘దిస్ ఈజ్ ఇట్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తే దానికి మంచి స్పందనే వచ్చింది.
ఐతే ఇప్పుడు మైకేల్ జాక్సన్ జీవితం మొత్తాన్ని ఒక బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం జరిగింది. ‘మైకేల్’ పేరుతో ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రాన్ని రూపొందించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ఈ సినిమా వరల్డ్ వైడ్ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. అచ్చం మైకేల్ జాక్సన్ లాగే ఉన్న ఆర్టిస్టును తీసుకుని.. సరైన మేకప్ వేసి ఈ పాత్ర చేయించినట్లున్నారు. మైకేల్ డ్యాన్సులను కూడా అతను దించేశాడు. కొన్ని మూమెంట్స్ చూస్తే మైకేల్ అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయనడంలో సందేహం లేదు. సినిమా కూడా అద్భుతంగా ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది ఈ గ్లింప్స్. మైకేల్‌ను ఇష్టపడే ప్రతి అభిమానికీ ఇది ఒక గొప్ప జ్ఞాపకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియాలో కూడా ఎంజేకు భారీగా అభిమాన గణం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తునే ఈ సినిమా రిలీజ్ కావచ్చు.