హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 11న జరగబోయే ఈ పోలింగ్‌లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ పోటీ పడుతున్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా సహజంగా ప్రజల్లో కొంత ఆసక్తి ఉంటుంది., అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరింత ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీలో లేదు. ఆయన ఆ పార్టీ పేరును మాత్రం రెండు పార్టీల ముఖ్య నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ టీడీపీని అభిమానించేవారు ఉండడమే ఇందుకు కారణం.
‘నందమూరి తారక రామారావు గారి పేరు నా పేరు ఒక్కటే తెలుగుదేశం పార్టీ అంటే నాకు అభిమానం. మా నాన్న పుట్టిన పార్టీ తెలుగుదేశం మా నాన్నకు రాజకీయ భవిషత్తు ఇచ్చింది ఆ పార్టీ. తెలుగుదేశం కార్యకర్తలు మాకే ఓటు వేస్తారు అని నాకు బలమైన నమ్మకం… అంటూ బీఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, మరోవైపు చంద్రబాబు గారి అరెస్టుకు నిరసన తెలిపే హక్కు ఇవ్వనివారికి మద్దతిస్తారా? ఎన్టీఆర్ ఘాట్ తొలగించాలని యత్నించిన వారికి ఓటేస్తారా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మొత్తం మీద టిడిపి అనుకూల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఏపీలో తెలుగుదేశం, బిజెపి, జనసేన కలిసి కూటమి ప్రభుత్వంగా అధికారంలో ఉంది. ఈ ఎన్నికకు ఇందులో రెండు పార్టీలు టిడిపి, జనసేన దూరంగా ఉన్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిలను జనసేన తెలంగాణ ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పలువురు నాయకులు కలసి మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మాత్రం బహిరంగంగా ఎవరికి మద్దతు తెలియజేయలేదు. జూబ్లీహిల్స్ పరిధిలో టీడీపీ సానుభూతి పరుల సంఖ్య గణనీయంగా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఈ వర్గం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచింది. ఆ మద్దతు ఇప్పుడు కూడా కొనసాగుతుందా.. లేక బీజేపీకి మారుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
ఈ మొత్తం పరిణామాలు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని రెండు ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు తమ ప్రచారంలో ప్రస్తావించడం ఆ పార్టీకి ఉన్న బలాన్ని తెలియజేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిడిపి సానుభూతిపరులు ఆ మూడు పార్టీల్లో ఎవరు వైపు మొగ్గుతారు అనే అంశంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో తమ రాజకీయ భవితవ్యం పై తెలుగుదేశం పార్టీ, జనసేన కీలక నిర్ణయాలు తీసుకుంటాయని భావిస్తున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికను ఏపీలో రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.