hyderabadupdates.com movies గర్ల్ ఫ్రెండ్ ఏ స్థాయికి వెళ్తుంది

గర్ల్ ఫ్రెండ్ ఏ స్థాయికి వెళ్తుంది

రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన ది గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. టీమ్ చేసిన విస్తృతమైన ప్రమోషన్లు వర్కౌటయ్యాయి. టాక్, రివ్యూలు పాజిటివ్ గా రావడం వసూళ్లకు దోహదం చేస్తోంది. శుక్ర శనివారాలతో పోలిస్తే ఆదివారం ట్రెండింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా యూత్ బాగానే థియేటర్లకు వస్తున్నారు. సీరియస్ కంటెంట్, స్లో నెరేషన్ అనే కామెంట్స్ ఉన్నప్పటికీ రష్మిక నటన, కాంటెంపరరీ సబ్జెక్టు తీసుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తాను చెప్పాలనుకున్న మెసేజ్ ని జనంలోకి బాగానే తీసుకెళ్లాడు. ప్రశంసలు, సోషల్ మీడియా ట్వీట్లు గర్ల్ ఫ్రెండ్ కు మేలు చేస్తున్న మాట వాస్తవం.

అయితే ఇదే ఊపు రేపటి నుంచి ఉంటుందా అనే దాని మీద బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ కి రెగ్యులర్ మాస్ వెళ్లడం లేదు. ఇలాంటివి మనకు సరిపడవనే రీతిలో దూరంగా ఉన్నారు. వాళ్ళను రప్పించాలంటే పబ్లిసిటీ గేరు మార్చాలి. అదంత సులభం కాదు కానీ టీమ్ మాత్రం యువతని ఇంకా ఎక్కువ ఎలా రాబట్టాలి అనే దాని మీద దృష్టి పెడుతోంది. ఇక కమర్షియల్ లెక్కల విషయానికి వస్తే ఇప్పటికైతే అధికారిక నెంబర్లను బయటికి వదల్లేదు. ఓపెనింగ్ తక్కువ రావడం కారణం అనుకున్నా ఇప్పుడు పికప్ అయ్యింది కాబట్టి రేపటికి అంకెలు రివీల్ చేస్తారేమో వెయిట్ చేయాలి.

గర్ల్ ఫ్రెండ్ కు కలిసి వచ్చిన మరో అంశం జటాధర డిజాస్టర్ కావడం. పోటీలో ఉన్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి మంచి టాక్ ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో వసూళ్లుగా మారలేకపోవడం రష్మిక బృందానికి ప్లస్ అవుతోంది. వచ్చే వారం దుల్కర్ సల్మాన్ కాంత, సంతాన ప్రాప్తిరస్తు, శివ రీ రిలీజ్ ఉన్నాయి కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టుకుంటే గర్ల్ ఫ్రెండ్ సేఫ్ అవుతుంది. సోమవారం ఆక్యుపెన్సీలు ఏ మేరకు డ్రాప్ అవుతాయనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ డిసైడ్ అవుతుంది. అన్నట్టు వచ్చే వారం మరో గ్రాండ్ ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్నారట. బన్నీ లేదా విజయ్ దేవరకొండ గెస్టులుగా వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి.

Related Post