దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, అటు ప్రధాని నరేంద్ర మోడీకి, ఇటు ఎన్డీయే కూటమికి కూడా.. పెను సవాలు గా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ఆదివారం(నవంబరు 9) సాయంత్రం తెరపడనుంది. ఈ రాష్ట్రంలో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటికి రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ నెల 6న తొలిదశ పోలింగ్(121 స్థానాలకు) పూర్తయింది. ఇక, మరో 122 స్థానాలకు ఈ నెల 11న మంగళవారం పోలింగ్ జరగనుంది.
అయితే.. రెండో దశ పోలింగ్‌ను అన్ని పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం.. తొలి దశలో జరిగిన పోలింగ్‌లో 65.08 శాతం ఓటింగ్ నమోదు కావడమే. ఇంత భారీ ఎత్తున ఓటర్లు క్యూకట్టి పోలింగ్ కేంద్రాలకు రావడం.. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ జరగలేదు. దీంతో తొలిదశ పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి అనుకూలంగా వ్యవహరించారన్నది చర్చగా మారింది. అయితే.. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు రావడాన్ని కీలకమైన కూటములుగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలో మహాఘఠ్‌బంధన్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటములు కూడా ఎవరికి వారు తమ తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఓటర్లు భారీ ఎత్తున తరలి వచ్చారంటూ.. కాంగ్రెస్ కూటమి పక్షాలైన ఆర్జేడీ సహా ఇతర పక్షాలు ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు.. ప్రధాని సహా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం.. తమ సుపరిపాలనను చూసి ప్రజలు పోటెత్తారని.. చెబుతున్నాయి. ప్రధాని మరో అడుగు ముందుకు వేసి.. 65 శాతం ఓట్లు పోలవడాన్ని.. “ప్రతిపక్షాలకు 65 వోల్టుల విద్యుత్ షాక్` ఇచ్చారంటూ.. అభివర్ణించారు. ఇది తమకు మేలు చేస్తుందని.. కూడా చెప్పారు.
దీంతో ఇప్పుడు `65 వోల్టుల షాక్` ఎవరికి తగులుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు.. మంగళవారం జరగనున్నఎన్నికల్లో 122 స్థానాల్లోనూ.. పూర్వాంచల్ కీలకంగా మారనుంది. దీనిలో ఎంఐఎం పార్టీ కూడా కీలక పార్టీగా చక్రం తిప్పుతోంది. ఈ నాలుగు జిల్లాల్లో 17 స్థానాల్లో ఎంఐఎం పోటీలో ఉంది. పైగా వీటిలో 6 సిట్టింగు స్థానాలే కావడం గమనార్హం. దీనికి తోడు యాదవ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న జిల్లాలతోపాటు.. పూర్వాంచల్ ను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ ను తెరమీదికి తెచ్చిన సామాజిక ఉద్యమకారుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు 65 కాదు.. దీనిని 85 వోల్టులకు చేర్చాలని పార్టీలు భావిస్తున్నాయి. ఏదేమైనా.. బీహార్ చివరి దశ పోలింగ్.. ఉత్కంఠకు దారితీస్తోంది.