న్యాయ పరిభాషను సరళీకరించడం ద్వారా చట్టం అందరికీ అవలీలగా అర్థమయ్యేలా చూడాలని… సామాజిక ఆర్థిక నేపథ్యంతో ప్రమేయం లేకుండా ప్రతి పౌరునికీ తేలికగా న్యాయం అందేందుకు ఇది దోహద పడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. న్యాయశాస్త్ర గ్రంథాల్లోని భాషను సరళీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. న్యాయ సహాయం అందజేత వ్యవస్థల బలోపేతంపై శనివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) 30వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో.. సామాజిక మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న న్యాయ సహాయం.. పేదలకు తేలికగా న్యాయం అందేందుకు దోహదపడుతోందని చెప్పారు. సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి పౌరునికీ న్యాయం అందితే సామాజిక న్యాయం అందరికీ అందినట్లేనని పేర్కొన్నారు.
కోర్టు తీర్పులు స్థానిక భాషల్లో అందించాలి
కోర్టు తీర్పుల్ని, ఇతర న్యాయసంబంధ పత్రాలను స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చూపుతున్న చొరవను అభినందించారు. సుప్రీంకోర్టు 80 వేలకు పైగా తీర్పుల్ని 18 భారతీయ భాషల్లోకి అనువదించేందుకు చూపిన చొరవ శ్లాఘనీయమని అన్నారు. హైకోర్టులు, జిల్లా న్యాయస్థానాలు కూడా ఇలాంటి చొరవ చూపుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.కాలదోషం పట్టిన 1,500కి పైగా చట్టాలను గత 11 ఏళ్లలో రద్దుచేశామని, 3,400 నిబంధనల్ని నేరరహితం చేశామని గుర్తుచేశారు. చాలాఏళ్లుగా ఉన్న చట్టాల స్థానంలో భారతీయ న్యాయసంహితను తీసుకువచ్చామని చెప్పారు. మధ్యవర్తిత్వం ఎప్పటినుంచో మన నాగరికతలో ఉందని, దానిని ఆధునిక రూపంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్తచట్టం దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
న్యాయం పొందడం అందరి హక్కు – సీజేఐ
సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ మాట్లాడుతూ- న్యాయం ఏ కొందరికో పరిమితమయ్యే ప్రత్యేక గౌరవం కాదని, ఇది ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. న్యాయం ప్రసరించే వెలుగులు చివరి వ్యక్తి వరకూ చేరేలా చూడటం న్యాయవాదులు, న్యాయమూర్తుల ధర్మమని చెప్పారు. కార్యక్రమానికి ప్రధాని హాజరు కావడం శాసననిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల సమష్టి బాధ్యతను సూచిస్తోందని అన్నారు. సంక్లిష్టమైన వ్యాజ్యాలను ఎంత అవలీలగా పరిష్కరించారన్న దానిపై న్యాయవ్యవస్థ సామర్థ్యం ఆధారపడదని, ప్రజల జీవితాలపై ప్రభావం చూపడమే సామర్థ్యానికి గీటురాయి అని.. కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. ఉచిత న్యాయసేవ అందించాలని నిర్దేశించడం ద్వారా మన రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టిని చాటారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అన్నారు.
డిసెంబరు 1నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఈ విషయాన్ని శనివారం ప్రకటించారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ సెషన్‌లో ఉభయ సభలు 15రోజులు మాత్రమే సమావేశం(సిట్టింగ్స్) కానున్నాయి. దీనిపై విపక్షాలు విమర్శలు వ్యక్తం చేశాయి. పార్లమెంటు సమావేశాలను ఆలస్యంగా నిర్వహించడమే కాకుండా, వ్యవధిని కుదించడంలో కేంద్రప్రభుత్వం ఉద్దేశం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎ్‌సఐఆర్) చేపట్టిన నేపథ్యంలో ఈ సమావేశాలు జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. బిహార్‌లో ఎస్‌ఐఆర్ జరిగిన సమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగాయి. అప్పుడు ఈ ఎస్‌ఐఆర్ అంశం సమావేశాలను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే.
The post PM Narendra Modi: న్యాయ పరిభాష సులభంగా ఉండాలి – ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
PM Narendra Modi: న్యాయ పరిభాష సులభంగా ఉండాలి – ప్రధాని మోదీ
Categories: