బాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన గోవిందాకు, ఆయన భార్య సునీత ఆహుజాకు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు, ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని నెలల ముందు వార్తలు రావడం తెలిసిందే. గతంలోనూ ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ గొడవ సద్దుమణగడంతో వారి వివాహ బంధం సాఫీగానే సాగిపోతోందని అనుుకన్నారు.
కానీ ఈసారి వ్యవహారం సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. సునీత విడాకుల పిటిషన్ కూడా ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. గోవిందా మోసగాడని, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని.. తనపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించినట్లు ఇంతకుముందు వార్తలు రాగా.. గోవిందా లాయర్ ఆ ప్రచారాన్ని ఖండించారు. కానీ తర్వాత ఏమైందో స్పష్టత లేదు. కానీ ఇప్పుడు సునీతా ఆహుజా తన భర్త మీద బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన్ని మోసగాడిగా అభివర్ణించింది.
‘‘చిన్నతనంలో అందరూ తప్పులు చేస్తారు. అది సహజం. నేను కూడా చాలా తప్పులు చేశాను. గోవిందా కూడా చేశాడు. కానీ ఒక వయసు వచ్చాక కూడా తప్పులు చేస్తూనే ఉంటే ఎలా? మీకు భార్య, పిల్లలు ఉన్నపుడు ఎందుకు అలాంటి తప్పులు చేస్తున్నారు? నిజం చెబుతున్నాను. గోవిందా తన జీవితంలో భార్య కంటే తన హీరోయిన్లతోనే ఎక్కువ గడిపాడు. మొదట్లో నాకు ఏమీ అర్థం కాలేదు. అన్నీ తెలిసేసరికి జీవితం చాలా ముందుకు వచ్చేసింది’’ అని సునీత కుండబద్దలు కొట్టేసింది.
గోవిందా అక్రమ సంబంధాల విషయంలోనూ సునీత ముందు నుంచి గొడవ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తన మాటల్ని బట్టి చూస్తే విడాకులకు కారణమేంటో అర్థమైపోయింది. ఇంతకుముందు భార్యకు సర్దిచెప్పుకోగలిగిన గోవిందా.. ఈసారి మాత్రం ఏమీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 37 ఏళ్ల వీరి వివాహ బంధానికి త్వరలోనే తెరపడబోతున్నట్లు స్పష్టమైపోయింది.