మాస్ మహారాజా రవితేజ గత కొన్నేళ్లుగా చేస్తున్న మాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా కొడుతున్నాయి. ఒక్క ధమాకా తప్ప మిగిలినవన్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇటీవలే వచ్చిన మాస్ జాతర మరీ అన్యాయం. ప్రీమియర్ షో నుంచే నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. అయినా సరే నిన్న వీకెండ్ మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ నమోదు చేయడం చూస్తే జనం మాస్ ఎంటర్ టైనర్స్ కోసం ఎంతగా కరువులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఉంటే కనీసం రెండు వారాలు భారీ నెంబర్లు నమోదయ్యేవి. మంచి అవకాశం చేతులారా వృథా అయ్యింది.
ఇది పక్కనపెడితే రవితేజ కొత్త సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది. టైటిల్ రివీల్ సందర్భంగా చిన్న టీజర్ వదిలారు. అందులో కాన్సెప్ట్ ఏంటో చెప్పారు. ఇద్దరు అమ్మాయిలు జీవితంలో ఉన్న ఒక ఉద్యోగికి పెద్ద సంకటం వచ్చి పడుతుంది. ఎవరిని అడిగినా ఆఖరికి ఏఐ టెక్నాలజీ వాడినా సమాధానం దొరకదు. అసలా ప్రశ్న ఏంటి, అతను ఎదురుకున్న ఆ ఇబ్బంది ఏంటనేది తెరమీద చూడాలి. తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా రవితేజ పూర్తిగా క్లాస్ టచ్ తీసుకున్నాడు. ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి మధ్య నలిగిపోయే నారీనారీ నడుమ మురారిగా అలరించబోతున్నాడు.
ఇప్పుడీ మార్పు మంచిదే. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి మళ్ళీ దగ్గరవ్వాలంటే ఇలాంటి కథలే ఎంచుకోవాలి. వరస ఫ్లాపులు తన మార్కెట్ ని ప్రభావితం చేసి ఉండొచ్చేమో కానీ ఇమేజ్ ని కాదు. సో భర్త మహాశయులకు విజ్ఞప్తి మంచి నిర్ణయమే కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ లో పెద్ద క్యాస్టింగే ఉంది. శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సునీల్ ఇలా సీనియర్ తారాగణాన్ని సెట్ చేసుకున్నారు. డేట్ ఇంకా చెప్పలేదు కానీ పండగ బరిలో ఉన్న మన శంకరవరప్రసాద్ గారు, రాజా సాబ్, అనగనగా ఒక రాజు, జన నాయకుడు, పరాశక్తిలతో రవితేజ పెద్ద పోటీనే ఎదురుకోవాల్సి ఉంటుంది.