దుల్కర్ సల్మాన్ పేరుకు మలయాళ నటుడే కానీ.. వివిధ భాషల్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో అతను పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా తెలుగులో అతను నటించిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ కల్ట్ మూవీస్‌గా పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడతను తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘కాంత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీని టీజర్, ట్రైలర్ చూస్తే ఇది కూడా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి.
మణిరత్నం ‘ఇద్దరు’ సినిమాను గుర్తుకు తెచ్చాయి దీని ప్రోమోలు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ‘మహానటి’ తరహాలోనే ఇది కూడా ఒక బయోపిక్కే. తెలుగు వాళ్లకు పెద్దగా తెలియని ఒక లెజెండరీ తమిళ నటుడి కథతో దీన్ని రూపొందించాడట దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్.
తెలుగులో ఎన్టీఆర్ కంటే ముందు చిత్తూరు నాగయ్య ఎలా సూపర్ స్టార్‌గా ఎదిగి తర్వాత తెరమరుగు అయ్యాడో.. తమిళంలో కూడా అలాంటి నటుడు ఒకరున్నారు. ఆయనే ఎంకే త్యాగరాజన్. అభిమానులు ఎంకేటీ అని పిలుచుకునే ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కిందట.
1910లో పుట్టిన త్యాగరాజన్‌ది పేద కుటుంబం. ఐతే స్టేజ్ సింగర్‌గా పేరు సంపాదించింది ఎంకేటీ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. ఆయన నటించిన హరిదాస్ వంద వారాలకు పైగా ఆడిందట. దీంతో ఆయనకు సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది. 1940 ప్రాంతంలోనే మెర్సీడెస్ బెంజ్‌లో తిరగడమే కాక.. బంగారు పళ్లేల్లో భోజనం చేసేవాడట ఎంకేటీ.
ఐతే 1944లో ఒక హత్య కేసులో చిక్కుకోవడం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. రెండేళ్లు జైల్లో ఉన్న ఆయన ఈ కేసు నుంచి నిర్దోషిగా రిలీజయ్యాడు. కానీ ఈ కేసు ఎంకేటీ పేరును చెడగొట్టింది. మళ్లీ సినిమాల్లోకి వచ్చినా జనం పట్టించుకోలేదు. చివరికి డబ్బులన్నీ కూడా పోగొట్టుకుని ఆరోగ్యం దెబ్బ తిని 1959లో 49 ఏళ్ల వయసులోనే ఎంకేటీ చనిపోయారు. ఆయన పాత్రనే ‘కాంత’లో దుల్కర్ పోషించినట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.