కేరళ వాటర్ అథారిటీ (KWA) ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. కేరళలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్ కూలడంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపై గుమ్మరించినట్లు పడిపోయింది. దీంతో అనేక ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీరు ఉద్ధృతంగా రావడంతో పలు ఇళ్ల పైభాగాలు కూలిపోయాయని.. అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు.
తెల్లవారుజామున 2 గంటలకు కేడబ్ల్యూఏ ఫీడర్ పంప్ హౌస్‌లోని వాటర్ ట్యాంక్‌లో కొంత భాగం కూలిపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఇళ్లల్లోకి భారీగా నీరు చేరడంతో అనేక ఎలక్ట్రిక్ పరికరాలు, ఫర్నిచర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి నీరు చేరడంతో పెద్ద మొత్తంలో మందులు, వైద్య పరికరాలు పాడైనట్లు అధికారులు తెలిపారు. ఈ ట్యాంక్‌ను 50 ఏళ్ల క్రితం నిర్మించారని.. దీనినుంచి కొచ్చి, త్రిపునితుర ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుందని ఎర్నాకుళం ఎమ్మెల్యే వినోద్ వెల్లడించారు. వరద వల్ల ప్రభావితమైన ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని కేడబ్ల్యూఏను కోరారు. కొచ్చి, ఇతర ప్రాంతాలకు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేడబ్ల్యూఏ అధికారులు తెలిపారు.
కేరళ బస్సులు బంద్
ఇకపై కేరళ టూరిస్ట్ బస్సులు కర్ణాటక, తమిళనాడుకు వెళ్లవు. ఆ రెండు రాష్ట్రాలకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కేరళ రాష్ట్ర కమిటీ లగ్జరీ బస్సు యజమానుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. దీని వెనుకగల కారణం ఏమిటి? ఆయా రాష్ట్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా? అనే విషయంలోకి వెళితే… కేరళ నుండి తమిళనాడు, కర్ణాటకకు అంతర్రాష్ట్ర పర్యాటక బస్సు సర్వీసులను (నేడు)సోమవారం సాయంత్రం 6 గంటల నుండి నిలిపివేస్తున్నట్లు లగ్జరీ బస్సుల యజమానుల సంఘం, కేరళ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పొరుగు రాష్ట్రాలు భారీ జరిమానాలు విధించడం, చట్టవిరుద్ధమైన రాష్ట్ర స్థాయి పన్నులు విధించడం, దీనికితోడు కేరళ ఆపరేటర్లకు చెందిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (ఏఐటీపీ) బస్సులను సీజ్ చేయడం తరచూ జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏజే రిజాస్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం కింద జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఏఐటీపీలు ఉన్నప్పటికీ, కేరళ నుండి వచ్చే పర్యాటక వాహనాలను తమిళనాడు, కర్ణాటకలో ఆపడం, జరిమానా విధించడం, నిర్బంధించడం జరుగుతున్నదని ప్రధాన కార్యదర్శి మనీష్ శశిధరన్ మీడియాకు తెలిపారు. ‘ఏడాదిగా తమిళనాడు అధికారులు కేరళలో రిజిస్టర్ అయిన వాహనాల నుండి ఇష్టారాజ్యంగా పన్ను వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఆపరేటర్లకు, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేరళ ప్రభుత్వం కూడా తమకు సహకరించడంలేదని అన్నారు.
వాహనాలను స్వాధీనం చేసుకుంటున్న కారణంగా చాలా మంది ఆపరేటర్లు అంతర్రాష్ట్ర సేవలను నిర్వహించేందుకు వెనుకాడుతున్నారని తెలిపారు. ఈ సర్వీస్ సస్పెన్షన్ స్వచ్ఛంద నిరసన కాదని, వాహనాలు, డ్రైవర్లు, ప్రయాణికుల భద్రత కోసం తీసుకున్న చర్య అని అసోసియేషన్ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు సమావేశం కావాలని అసోసియేషన్ అభ్యర్థించింది. అలాగే ఈ సమస్య పరిష్కారానికి అసోసియేషన్ కేరళ రవాణా మంత్రి కేబీ గణేష్ కుమార్‌కు కూడా ఒక లేఖ రాసింది.
The post Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !
Categories: