పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుంకర పద్దయ్య గారి వీధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి, తమ్ముడిని దారుణంగా నరికి చంపాడు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం… గునుపూడి శ్రీనివాసరావుకు మానసిక స్థితి సరిగా లేదు. అతని తల్లి మహాలక్ష్మి(60), తమ్ముడు రవితేజ(33)తో కలిసి ఉంటున్నాడు. శ్రీనివాసరావుకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా శ్రీనివాసరావు తల్లి, తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేసేలోపు కిరాతకంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం ఓ గంట తర్వాత శ్రీనివాసరావే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు.
భీమవరం వన్ టౌన్ పరిధిలో జరిగిన జంట హత్యల ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. నేరం జరిగిన ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించడంలో భాగంగా, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ అధికారులతో కలిసి ముఖ్యమైన కీలక ఆధారాలను సేకరించారు. అనంతరం, భీమవరం వన్ టౌన్ పోలీసు అధికారులను కేసు దర్యాప్తు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ దారుణ ఘటనలో, స్థానికుడు గునుపూడి శ్రీనివాస్ (37) తన తల్లి గునుపూడి మహాలక్ష్మి (60), మరియు తమ్ముడు గునుపూడి రవితేజ (33) లను కుటుంబ సమస్యల కారణంగా హత్య చేసినట్లు, అంతేకాక నిందితుడి మానసిక స్థితి సరిగా లేనట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని ఎస్పీ తెలిపారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, జిల్లా ఎస్పీ గారు దర్యాప్తు అధికారులకు తక్షణమే, కేసును అన్ని కోణాల్లో వేగవంతంగా, పారదర్శకంగా దర్యాప్తు చేయాలని, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట భీమవరం డీఎస్పీ ఆర్. జయసూర్య గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ, మరియు భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం. నాగరాజు ఉన్నారు.
The post Double Murder: భీమవరంలో దారుణం ! తల్లి, తమ్ముడిని కత్తితో నరికి చంపిన వ్యక్తి ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Double Murder: భీమవరంలో దారుణం ! తల్లి, తమ్ముడిని కత్తితో నరికి చంపిన వ్యక్తి !
Categories: