వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఏళ్ళ తరబడి కొనసాగుతుందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, కోర్టుకు రాకుండా వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఐదేళ్లు గడిపేశారని కూడా వైసీపీ హయాంలో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయితే, ప్రస్తుతానికి ప్రతిపక్ష నేత కాని సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్ ఇంకా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతుండడంపై పలువురు విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే ఈ నెల 14 లోపు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే, వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలోనే జగన్ పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రకారం సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది.
దీంతో, దిగి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21 లోపు వ్యక్తిగతంగా జగన్ కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ తరఫు లాయర్ల అభ్యర్థన మేరకు వారం రోజుల గడువునిచ్చింది. చాలా ఏళ్ల విరామం అనంతరం జగన్ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు.