అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో నారా లోకేష్ గ్రాఫ్ పుంజుకుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు.. జాతీయ మీడియా ఆయన కోసం వేచి ఉండడం గమనార్హం. ఈ పరిణామం అసాధారణం. ఎంతో ఇమేజ్ ఉంటే తప్ప.. జాతీయ మీడియా.. అందునా.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో వేచి ఉండడం అరుదుగానే సంభవిస్తుంది.
దీనిని బట్టి జాతీయ స్థాయిలో నారా లోకేష్‌కు ఇమేజ్ పెరిగిందన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన లోకేష్‌కు మరో అనుభవం కూడా ఎదురైంది. కొందరు బీజేపీ జాతీయ నాయకులు ఆయనతో చర్చించేందుకు.. క్యూ కట్టారు. కొందరైతే.. ఆయనను తమ ఇళ్లకు ఆహ్వానించారు. కానీ, బిజీ షెడ్యూల్ నేపథ్యంలో లోకేష్ ఎవరి ఇంటికీ వెళ్లలేదు. దీంతో వారివారి కుటుంబాలను పార్టీ కార్యాలయాలకు పిలిచి సెల్ఫీలు తీసుకున్నారు.
మరోవైపు.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి చెందిన రాజకీయ పరిశీలకుల బృందం ప్రత్యేకంగా ఉంది. ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ.. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో నిశితంగా గమనిస్తుంది. ఈ కమిటీ కూడా.. తాజాగా బీహార్ లో నారా లోకేష్.. చేసిన ప్రసంగాలు, మీడియా చిట్‌చాట్‌లకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిని ప్రధానికి అందించనున్నారు.
ఇలా.. ఎంతో ప్రభావం చూపించే నాయకుల విషయంలో మాత్రమే స్పందించి, నివేదికలు సిద్ధం చేసే పీఎంవో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. నారా లోకేష్ చేసిన ప్రసంగాలకు సంబంధించి పేపర్ల లో వచ్చిన(జాతీయ మీడియా) కటింగ్స్‌ను కూడా సేకరించింది. సో.. ఈ పరిణామాలతో జాతీయస్థాయిలో నారా లోకేష్ ఎలివేషన్ జోరుగా సాగుతోందని పార్టీ ఎంపీలు చెబుతున్నారు. ఇక, రాష్ట్ర స్థాయిలో నాయకులకు కూడా నారా లోకేష్ ఇప్పటి వరకు ఆదర్శంగా మారితే.. ఇప్పుడు దాంతో పాటు.. క్రమశిక్షణ పరంగా కూడా ఆయన ఐకాన్ అయ్యారు.