ఇంకో రెండు రోజుల్లో అఖండ 2 తాండవం నుంచి మొదటి ఆడియో సింగల్ రానుంది. తమన్ దీని గురించి తెగ ఊరిస్తున్నాడు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ కలిసి పాడిన ఈ పాట వింటే నిద్ర పట్టలేదని, వెంటాడుతూనే ఉందని, ఇదంతా శివుడి మహాత్యమని చాలా గొప్పగా చెబుతున్నాడు. నిజంగా అలా ఉంటే సంతోషమే. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా అఖండ 2 నుంచి పెద్ద అడుగు పడలేదు. చిన్న టీజర్ తప్ప ఎలాంటి కంటెంట్ వదల్లేదు. చూస్తేనేమో రిలీజ్ డేట్ కేవలం 23 రోజుల దూరంలో ఉంది. ఇందులోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేయాలి. ముఖ్యంగా ప్యాన్ ఇండియా ప్రమోషన్లు కీలకం కాబోతున్నాయి.
సోషల్ మీడియాలో సినిమాల పరంగా ఉన్న గ్యాప్ ని పెద్ది చికిరి చికిరి సాంగ్ తీర్చేసింది. దాని మేనియా మూడు నాలుగు రోజుల నుంచి నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. చరణ్ డాన్స్, రెహమాన్ వైబ్స్ ఆస్వాదిస్తూ నార్త్ నుంచి సౌత్ దాకా దాన్నో వైరల్ వీడియోగా మార్చేశారు. ఇప్పుడా స్థానాన్ని అఖండ 2 తీసుకోవాలి. అయితే తమన్ చెప్పినట్టు పాట ఎక్స్ ట్రాడినరిగా ఉండాలి. సినిమా చాలా బాగా వచ్చిందనే టాక్ యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తోంది కానీ అది జనాలకు అర్థం కావాలంటే సరైన ఆల్బమ్, టీజర్, ట్రైలర్ అవసరం. అందుకే రాబోయే మూడు వారాలు అఖండ 2 బృందం రాకెట్ స్పీడ్ తో పరుగులు పెట్టాలి.
బాలకృష్ణ ఫ్యాన్స్ పబ్లిసిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత హైప్ ఉన్నా వీలైనంత మార్కెటింగ్ చేసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం. పైగా 14 రీల్స్ టీమ్ ముందు రోజు రాత్రే ప్రీమియర్లు ప్లాన్ చేస్తోందని సమాచారం. ఓజి తరహాలో స్పెషల్ షోలు వేస్తే బాగుంటుందనే ఆలోచన బోయపాటి శీను బృందంలో ఉందట. అభిమానుల ఒత్తిడి మేరకు దీని ఎస్ అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెజిఎఫ్, పుష్ప, బాహుబలి, కాంతార తరహాలో ఫస్ట్ పార్ట్ ని మించేలా సీక్వెల్ హిట్టవ్వడం అఖండ 2లోనూ చూస్తామని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అది నిజం కావాలనేది సగటు మూవీ లవర్స్ కోరిక.