అర్జున్ రెడ్డి, యానిమల్ తో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా త్వరలో ప్రభాస్ స్పిరిట్ మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే దీని గురించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వచ్చేశాయి. దాంట్లో ప్రధానంగా స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి ఉంటారని, ప్రభాస్ తండ్రిగా ఒక టెర్రిఫిక్ క్యారెక్టర్ డిజైన్ చేశారని ఏవేవో గాసిప్స్ చక్కర్లు కొట్టించారు. జిగ్రీస్ టీమ్ తో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా దీన్ని కొట్టి పారేస్తూ అలాంటిదేం లేదన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది.
చిరంజీవిని తన కెమెరా లెన్సులో చూడాలని ఉందని, ఒక స్టాండ్ అలోన్ మూవీ కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పి మెగా ఫ్యాన్స్ చెవుల్లో పాలు పోసినంత పని చేశారు. ఎప్పుడు సాధ్యమవుతుందో చెప్పలేం కానీ భవిష్యత్తులో ఉండే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఎందుకంటే తన ఆఫీస్ లో ఆరాధన సినిమా నుంచి నిలువెత్తు పులిరాజు ఎక్స్ ప్రెషన్ ని ఫోటోగా పెట్టుకున్న సందీప్ వంగా చిరంజీవి మీద పెట్టుకున్నది మాములు ఫ్యానిజం కాదు. మాస్టర్ లో మెగాస్టార్ వేసుకున్న చొక్కా రంగులు, ఎక్స్ ప్రెషన్లతో సహా చాలా డీటెయిల్స్ ఓ సందర్భంలో వివరించడం ఎక్స్, ఇన్స్ టాలో తెగ వైరల్ అయ్యింది.
ఇక చిరంజీవి విషయానికి వస్తే మన శంకరవరప్రసాద్ గారు తర్వాత విశ్వంభర రిలీజ్ ఉంటుంది. ఈలోగా బాబీ డైరెక్షన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. అది కాగానే శ్రీకాంత్ ఓదెల మోస్ట్ వయొలెంట్ డ్రామా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అయ్యేలోగా 2027 వచ్చేస్తుంది. అప్పటికంతా సందీప్ వంగా స్పిరిట్ పూర్తి చేసి ఉంటే మెగా కాంబోని ట్రై చేయొచ్చు. లేదా పెండింగ్ లో ఉన్న అల్లు అర్జున్ లేదా మహేష్ బాబుతో చేతులు కలపొచ్చు. ఇప్పటికిప్పుడు నిర్ధారణగా ఏదీ చెప్పలేం కానీ మెగాభిమానులు కోరుకుంటున్న కలయికలో చిరు – సందీప్ అయితే ఎప్పటికీ ఉంటుంది. వీలైనంత త్వరగా కార్యరూపం దాలిస్తే చాలు.