ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద ఘటనగా కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని పునరుద్ఘాటించింది. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో బుధవారం సాయంత్రం 7 గంటలకు కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల సేపు ఈ సమావేశం జరిగింది. అనంతరం సమావేశం వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
ఢిల్లీ పేలుడు ఘటన అత్యంత కిరాతక ఉగ్రవాద చర్యగా క్యాబినెట్ పేర్కొందని, ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఘటనపై శీఘ్రగతిన, పూర్తి వృత్తినిబద్ధతతో విచారణకు కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. తద్వారా దాడికి పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని, స్పాన్సరర్లను గుర్తించి వారిని చట్టం ముందుకు తీసుకురావచ్చని సమావేశం అభిప్రాయపడిందన్నారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్టు వెల్లడించారు. కాగా, ఈ సమావేశానికి ముందు ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా సీసీఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఢిల్లీ పేలుళ్ల మృతులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు,ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు, కేంద్ర మంత్రివర్గంలో చర్చి జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, ఎగుమతుల ప్రమోషన్ మిషన్ బలోపేతానికి 25,060 కోట్ల రూపాయల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మిషన్ కింద రెండు పథకాలను కేంద్రం నిర్వహించనుంది. నిర్యాత్ ప్రోత్సాహన్, నిర్యాత్ దిశ కొత్త పథకాలను కేంద్రం అమలు చేయనుంది. ఎగుమతి దారులకు 100 శాతం క్రెడిట్ గ్యారెంటీ స్కీం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 20,000 కోట్ల రూపాయల వరకు ఎలాంటి హామీ లేకుండా ఎగుమతి దారులకు ప్రభుత్వం.. క్రెడిట్ సపోర్ట్ ఇవ్వనుంది.
ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. లాల్ ఖిలా మెట్రోస్టేషన్ ఒకటో నంబర్ గేటు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగిన హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన భారీ పేలుడు ధాటికి కారులోని ముగ్గురు సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పక్కన ఉన్న ఆరు కార్లు, రెండు ఇ–రిక్షాలు, ఆటోలు సైతం తీవ్రస్థాయిలో ధ్వంసమయ్యాయి. దీంతో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది.
పేలుడు ధాటికి సమీప మార్కెట్లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
The post Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్
Categories: