చరిత్రాత్మక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్ ముజమ్మిల్ గనయీ పదేపదే ప్రయత్నం చేశాడా? అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండటంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా?.. దీంతో వచ్చే నెల 6న భారీ ఉగ్రదాడులకు పాల్పడాలని పన్నాగం పన్నారా? దర్యాప్తు సంస్థలకు దొరికిన పక్కా ఆధారాలు అవుననే సమాధానమిస్తున్నాయి. హరియాణాలోని ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాక డాక్టర్ షాహీన్ సయీద్, డాక్టర్ గనయీలను పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అదేరోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఈ రెండింటిపై జరుపుతున్న విచారణలో నిర్ఘాంతపరిచే అంశాలు వెలుగుచూస్తున్నాయి.
కొందరు అనుమానితుల్ని జమ్మూకశ్మీర్ పోలీసులు విచారించగా తాము తొలుత ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట లక్ష్యంగా దాడికి ప్రణాళిక వేశామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల్లో జనవరి మొదటివారంలో పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించామని తెలిపారు. తాను, అల్-ఫలా విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ నబీ(28) కలిసి రెక్కీ చేశామని కేసు నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ గనీ పోలీసులకు ధ్రువీకరించాడు. ఈ రిపబ్లిక్ డే నాడు కుదరనందున, వచ్చే జనవరి 26న దాడి చేయాలని నిర్ణయించామన్నాడు. మొబైల్ టవర్ల డేటాను, సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించినప్పుడూ ఈ మేరకు రుజువులు దొరికాయి. ఈ ఏడాది దీపావళి నాడు దిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు కూడా ఉగ్రవాదులు కుట్ర పన్నారని అధికార వర్గాలు తెలిపాయి.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఓ ఇంట్లోభద్రతా సిబ్బందిసోదాలు
ఎర్రకోట వద్ద పేలుళ్లకు ఉద్దేశించిన రెండో పదార్థం అమ్మోనియం నైట్రేట్ కంటే శక్తిమంతమైనదని, అందులో ఏమేం వాడారనేది లోతైన ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత ధ్రువీకరణ అవుతుందని విచారణాధికారి ఒకరు తెలిపారు. పేలని కొన్ని తూటాలను, సుమారు 40 ఇతర ఆనవాళ్లను ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. వాటి విశ్లేషణలో అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు లభించాయని, అదనంగా మరొక అత్యంత శక్తిమంతమైన పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. కారులో పేలుడుకు వాడిన పదార్థాల తీరుతెన్నులపై లోతైన విచారణ జరుగుతోంది. జమ్మూకశ్మీర్ పోలీసులు బుధవారం హరియాణాలోని మెవాత్‌లో మౌల్వీ ఇశ్తియాక్ అనే మతబోధకుడిని నిర్బంధంలో తీసుకున్నారు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలా విశ్వవిద్యాలయ సముదాయంలో అతడు నివాసం ఉన్న అద్దె ఇంటినుంచే 2,500 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. ఉగ్రవాదులు 26/11 ముంబయి దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు పథక రచన చేసినట్లు తేలింది. ఎర్రకోటతో పాటు ఇండియాగేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి ప్రముఖ కట్టడాలు వారి లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
డిసెంబరు 6న పేలుళ్లకు పన్నాగం
పేలుడు పదార్థాలున్న కారుతో ఎర్రకోట సమీపానికి వచ్చిన డాక్టర్ ఉమర్ నబీ డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత రోజు శక్తిమంతమైన పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఎనిమిదిమందిని విచారించిన మీదట ఇది బయటపడింది. ముజమ్మిల్ గనయీ అరెస్టుతో ఆ ప్రయత్నానికి గండిపడింది. విద్యాపరంగా మంచి రికార్డులున్న ఉమర్ కొన్ని టెలిగ్రాం గ్రూపుల్లో చేరి, 2021లో గనయీతో కలిసి తుర్కియేకి వెళ్లాక జీవితం తీవ్రవాదం వైపు మళ్లిందని గుర్తించారు. అక్కడే జైషే నేతల్ని వారు కలిసినట్లు భావిస్తున్నారు. అప్పటి నుంచి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, గంధకం వంటి పేలుడు పదార్థాల సమీకరణను ప్రారంభించి అల్‌ఫలా వర్సిటీ సమీపంలోనే నిల్వచేస్తూ వచ్చినట్లు గుర్తించారు. డిసెంబరు 6న చేయబోయే పేలుళ్ల గురించి సన్నిహితులకు చెప్పి, పేలుడు పదార్థాలను తన కారులో ఉంచడం ప్రారంభించాడని బయటపడింది.
ఇంటర్నెట్‌లో చూసి బాంబు తయారీ
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం శోధించి, వాహనంలో అమర్చే ఐఈడీ బాంబును ఉమర్ నబీ తయారు చేస్తూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ క్రమంలోనే అది పేలిందని చెబుతున్నారు. తాను మూడు నెలలపాటు అందుబాటులో ఉండనని అక్టోబరు 26న కశ్మీర్‌కు వెళ్లినప్పుడు బంధుమిత్రులకు చెప్పినట్లు తెలిసింది. కారులో బాంబును అమర్చి కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలనేదే ఆ మాటల ఉద్దేశంగా భావిస్తున్నారు. శ్రీనగర్‌లో పోస్టర్లు వెలిసిన అంశంలో పోలీసుల ముమ్మర దర్యాప్తుతో ఆ పన్నాగం బెడిసికొట్టింది.
జైషే మహమ్మద్‌తో సంబంధాలు
ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలు అనుమానితులను, నిందితులను విచారించిన అధికారులు, వారివద్ద నుంచి కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహ్మద్ ఉగ్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు ఈ దాడి వెనుక ప్రాథమిక విచారణలో బయటపడింది. దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా విధ్వంసకర దాడులకు ఈ ముఠా సిద్ధమవుతోందని అధికార వర్గాలు తెలిపాయి. అత్యంత శక్తివంతమైన సుమారు 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తేలింది. వీటిని ఉపయోగించి దిల్లీలోని ముఖ్య ప్రాంతాలతోపాటు రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద భారీ పేలుళ్లకు పన్నాగం పన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వరుస దాడులకు సిద్ధమయిందని సమాచారం.
విదేశీ మూలాలపై ఆరా
దిల్లీ పేలుడు కేసును విచారణకు స్వీకరించిన ఎన్‌ఐఏ 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితుల ఆర్థిక లావాదేవీలు, విదేశీ నిధుల మూలాలు, వారిని వెనకనుంచి నడిపిస్తున్న ప్రధాన కుట్రదారుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిఘా మండలి (ఐబీ) చీఫ్, ఎన్‌ఐఏ డీజీ భేటీ అయ్యారు. ఎర్రకోట పేలుడు ఒక ఘటన కాదని, పెద్దకుట్రలో భాగమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పేలుడు పదార్థాలు, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు కూపీ లాగుతున్నారు. పేలుడు ఎలా సంభవించిందో కచ్చితంగా తెలిపే దృశ్యాలూ సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ట్రాఫిక్‌లో ఒక్కసారిగా మండే అగ్నిగోళం ఏర్పడినట్లు ఇవి చెబుతున్నాయి. పాత కార్లను సరైన పత్రాలు లేకుండా మరొకరికి విక్రయిస్తున్నట్లు బయటపడటంతో సంబంధిత డీలర్లతో పోలీసులు సమావేశమై మార్గదర్శకాలు జారీ చేశారు.
The post Red Fort: ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఎర్రకోట ? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Red Fort: ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఎర్రకోట ?
Categories: