బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ పక్షం అఖండ మెజారిటీ సాధించడంతో ఏపీలోని కూటమి నేతల్లో పుల్ జోష్ నెలకొంది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. బిహార్ లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంలో సీఎం నితీశ్‌కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నా ని మేజిక్ మరోసారి పనిచేసిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, నాయకత్వానికి, నితీశ్‌కుమార్ నమ్మకమైన పరిపాలనకు ప్రజలు ఘనమైన మద్దతు ఇచ్చినట్లు ఈ తీర్పు స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
కొద్దిరోజుల కిందట బీహార్ ఎన్నికల ప్రచారానికి నారా లోకేష్ పాట్నా వెళ్లారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఎన్డీఏను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
బీహార్ ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. బిహార్ ఎన్నికల్లో విశేష విజయానికి చేరువ అయిన ఎన్డీఏ కూటమికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం, ముఖ్య మంత్రి నితీష్‌కుమార్ పరిపాలన కొనసాగాలనే స్పష్టమైన మరియు దృఢమైన తీర్పును బిహార్ ప్రజలు ఇచ్చారని భావించారు.
ఈ ఘన విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన అన్ని పొత్తు పార్టీల నేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజల విశ్వాసానికి మరియు అభివృద్ధి పై వారి ఆకాంక్షలకు ఈ తీర్పు ప్రతీక అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.