hyderabadupdates.com movies రాజమౌళి ఇవ్వబోయే సర్ప్రైజులేంటి?

రాజమౌళి ఇవ్వబోయే సర్ప్రైజులేంటి?

ఇంకొన్ని గంటల్లో ఇండియాస్ బిగ్గెస్ట్, మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబధించిన తొలి ప్రమోషనల్ ఈవెంట్ జరగబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రామోజీ ఫిలిం సిటీలో లాంచ్ చేయబోతున్నారు. ఐతే ఇందులో టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంచ్ చేస్తారు అన్నది మీడియా అంచనా మాత్రమే. ఈ ఈవెంట్లో పంచుకోబోయే విశేషాలు ఏంటి అన్నది స్పష్టంగా టీం నుంచి ఏ సమాచారం లేదు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అంటున్నారు తప్ప.. ఇందులో ఏం లాంచ్ చేయబోతున్నారు.. ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి విశేషాలు ఏంటి అన్నది చెప్పడం లేదు. నేరుగా ఈవెంట్లోనే ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది.

మామూలుగా తన కొత్త సినిమా మొదలయ్యేటపుడు ప్రెస్ మీట్ పెట్టి విశేషాలను పంచుకోవడం రాజమౌళికి అలవాటు. కానీ మహేష్ సినిమా విషయంలో మాత్రం అలా చేయలేదు. సైలెంటుగా షూట్ మొదలుపెట్టేశాడు. కొన్ని నెలల పాటు దేశ విదేశాల్లో చిత్రీకరణ జరిపారు. ఏ వేదిక మీదా సినిమా గురించి విశేషాలు పంచుకోలేదు. ఇప్పుడు ఈ భారీ ఈవెంట్ ద్వారా స్పెషల్ కంటెంట్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ ఈవెంట్‌కు వారం ముందు మొదలుపెట్టి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్, హీరోయిన్ ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్స్, ఒక పాట రిలీజ్ చేశారు. ఇవి అభిమానులకు పెద్ద సర్ప్రైజులే. 

ఐతే నేరుగా సోషల్ మీడియాలో ఇంత కంటెంట్ ఇచ్చినపుడు.. జస్ట్ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తారా అన్నది డౌట్. ఈ ఈవెంట్ స్కేల్‌ను బట్టి చూస్తే వీటికి మించి స్పెషల్ కంటెంట్ ఏదో ఉంటుందనే అనుకుంటున్నారు. బహుశా పెద్ద టీజర్ లాంటిదే రిలీజ్ చేయొచ్చు. అలాగే సినిమా కోసం తాము చేసిన కసరత్తు గురించి.. సినిమా కాన్సెప్ట్ గురించి ఏమైనా కంటెంట్ రిలీజ్ చేయొచ్చు. మేకింగ్ వీడియోను కూడా పంచుకునే ఛాన్సుంది. ఏం చేసినా.. మైండ్ బ్లోయింగ్ అనేలానే ఉంటుందని.. ఈ రోజు రాత్రికి ఇండియన్ సోషల్ మీడియా అంతా ఈ సినిమా ముచ్చట్లతోనే హోరెత్తిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

Related Post