జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీజేపీకు డిపాజిట్ కూడా రాలేదని… ‘ఆర్‌ఎస్ బ్రదర్స్’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు ముందు అన్ని సర్వేలు భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని చెప్పాయని… ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో, ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారన్నారు. అయినప్పటికీ పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చాయన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని… ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటామని చెప్పారు. ఉప ఎన్నిక ఫలితం వెల్లడైన అనంతరం తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితియే అని ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రజలు తీర్పు ఇచ్చారు. మా అభ్యర్థి మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా… గెలుపు కోసం పోరాడారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారంటీల అమలులో మోసాన్ని ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాం. మా ఒత్తిడి కారణంగానే గ్యారంటీల అమలుపై సీఎం సమీక్షించారు. మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం లేదని గళమెత్తితే అజారుద్దీన్‌కు పదవి ఇచ్చారు. ఈ ఫలితం మా పార్టీకి చిన్న ఎదురుదెబ్బే. నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కేసీఆర్‌ను తిరిగి సీఎం చేసేవరకు పోరాడుతూనే ఉంటాం. ఉపఎన్నిక ఎలా జరిగిందో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నకిలీ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేశాం. స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికే మూడు ఓట్లున్నాయి. ఎన్నికల కమిషన్, పోలీసుల పనితీరుపై చర్చ జరగాలి.
హరీశ్‌రావును మెచ్చుకున్న కేటీఆర్
ఉప ఎన్నికలో పార్టీకి ఓట్లేసిన, అభ్యర్థి గెలుపు కోసం కష్టనష్టాలకోర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తండ్రి మరణించినా హరీశ్‌రావు ఎప్పటికప్పుడు ఎన్నికల కోసం పనిచేశారని, సోదరుడు చనిపోయినా ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఒక్క రోజులోనే తిరిగివచ్చి ప్రచారంలో పాల్గొన్నారని కొనియాడారు.
ఆ 10 చోట్లా ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నాం
పశ్చిమ బెంగాల్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. ఇక్కడా 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నాం. ఒక ఉప ఎన్నికకే ఆపసోపాలు పడిన కాంగ్రెస్… పది ఉప ఎన్నికలొస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తాం. స్థానిక ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతాం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
The post KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్
Categories: