hyderabadupdates.com movies దూసుకొచ్చిన పెట్టుబడులు.. ఒక్కరోజులో ఎంతంటే

దూసుకొచ్చిన పెట్టుబడులు.. ఒక్కరోజులో ఎంతంటే

ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాటజీ సక్సెస్ అయింది. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు ద్వారా భారీ ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించాలన్న ఆయన వ్యూహం సఫలమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సులో తొలి రోజే 13 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించినట్టు సీఎం చెప్పారు. వాస్తవానికి ఈ సదస్సు జరిగే రెండు రోజుల్లో మొత్తం 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.

అయితే తొలి రోజే అంచనాలకు మించి 13 లక్షల కోట్ల రూపాయల మేరకు సాధించినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. ఇక ఇప్పటివరకు జరిగిన 17 మాసాల కాలంలో 10 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు సాధించామని, తాజాగా జరిగిన పెట్టుబడుల ఒప్పందాలతో ఈ సంఖ్య 23 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పోర్టులు, విద్యుత్, స్టార్టప్, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు విరివిగా వచ్చాయని చెప్పారు.

ఈ పెట్టుబడుల ద్వారా వేల మందికి ఉద్యోగాలు, లక్షల సంఖ్యలో ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో శ్రీసిటీ తిరుపతిలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంగా ముందుకు వచ్చారని చెప్పారు. వివిధ దేశాల పరిశ్రమలు శ్రీసిటీ పారిశ్రామిక టౌన్షిప్ కు రావాలని సూచించారు. అక్కడ మరొక 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 2028 నాటికే రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

కాగా తొలి రోజు సదస్సుకు 72 దేశాలకు చెందిన ప్రతినిధులు రాగా, రెండో రోజు మరొక 10 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. పెట్టుబడులకు గట్టి హామీ ఇస్తున్నందుకే ఈ తరహా స్పందన లభిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని మరోసారి హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి కూడా సహకారం ఉందని తెలిపారు.

Related Post