వారణాసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జరిగిన పొరపాట్లు, తప్పులు మహేష్ అభిమానులను అసంతృప్తికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ కాసేపు మొరాయించడం, రాజమౌళి అసహనానికి గురి కావడం, యాంకర్ సుమ టైంని మేనేజ్ చేయలేక కిందామీదా పడుతూ, ఏదేదో చేస్తూ ఆఖరికి రమా రాజమౌళి చేత ఇన్ డైరెక్ట్ గా తిట్లు తినడం ఇలా ఏవేవో జరిగిపోయాయి. దీని కన్నా ముందు టైటిల్ షాట్ ఉన్న మహేష్ బాబు లుక్కు ట్విట్టర్ లో లీకైపోవడం అన్నింటి కన్నా పెద్ద డ్యామేజ్. ఇదేదో ఫేక్ అనుకున్నారు కానీ తీరా చూస్తే అది నిజమైన వీడియో అని ఒరిజినల్ చూశాక అర్థమైపోయింది.
అసలు రెండు మూడు రోజుల నుంచి యాంకర్లను తీసుకొచ్చి వర్క్ షాప్ చేసిన రాజమౌళి దాన్నుంచి పెద్దగా ప్రయోజనం పొందలేదు. బోలెడు డబ్బు పోసి ముంబై నుంచి పట్టొచ్చిన ఆశిష్ చంచలాని ఎలాంటి మేజిక్ చేయలేకపోయాడు. తెలుగు రాకపోయినా హిందీ ఇంగ్లీష్ తో మేనేజ్ చేద్దామని చూసినా పనవ్వలేదు. ఒకదశ దాటాక సుమనే మొత్తం టేకోవర్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ స్క్రిప్ట్ ఓల్డ్ స్టైల్ లో సాగింది. రెగ్యులర్ ఈవెంట్స్ లో చూసే జోకులు, గెస్టులను అడిగే ప్రశ్నలు రొటీన్ గా ఉన్నాయి. మహేష్ బాబుని డమ్మీ నందిపై కూర్చోబెట్టి స్టేజి మీదకు తెచ్చిన విధానం కూడా సూపర్ ఎగ్జైటింగ్ గా లేదు. ఇవన్నీ ఫ్యాన్స్ చర్చలో ఉన్నాయి.
వీటిని ఇకపై జాగ్రత్తలు తీసుకోవడానికి కావాల్సిన హెచ్చరికలుగానే పరిగణించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లైవ్ లో చూస్తున్న వాళ్లకు ఓటిటి యాప్ లో వచ్చిన యాడ్స్ చిరాకు పుట్టించేశాయి. స్టేజి మీద కూడా స్పాన్సర్స్ ఉత్పత్తులను ప్లే చేయడం చాలా మందికి నచ్చలేదు. కోట్ల ఖర్చుతో ఈవెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ సహకారం అవసరమే కానీ మరీ ఇంతగా ఎక్స్ ప్లోర్ చేయాల్సిన అవసరం ఏముందనేది వాళ్ళ వెర్షన్. ముందు రోజు రాత్రి డ్రోన్ రావడం లాంటి సంఘటనలు సీరియస్ గా తీసుకుని ఇకపై జరగకుండా చూడాలి. ఏది ఏమైనా బ్లాక్ బస్టర్ అవుతుందన్న ఈవెంట్ కాస్తా జస్ట్ హిట్ దగ్గరే ఆగిపోయింది.