స్టార్ హీరోల మీద అభిమానుల ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది రుజువు. తమ హీరో వాడే వాహనం మీద ఉన్న ట్రాఫిక్ చలాన్లను కూడా తామే కట్టేసి అభిమానాన్ని చాటుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. రాజమౌళి సినిమాలో పూర్తిగా మునిగిపోయిన మహేష్.. చాన్నాళ్లుగా అభిమానులకు దూరంగా ఉన్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ ఈవెంట్ కోసమని మహేష్.. చాలా కాలానికి బయటికి వచ్చాడు. అభిమానుల ముందుకు వచ్చాడు.
ఈ సందర్భంగా మహేష్ వాడిన కారు మీద అభిమానుల కళ్లు పడ్డాయి. దాని గురించి ఆర్టీయే వెబ్ సైట్లో వెతికే క్రమంలో ఆ కారు మీద ట్రాఫిక్ చలాన్లు ఉన్న సంగతి వెల్లడైంది. రూ.2 వేలకు పైగా మొత్తానికి ఫైన్స్ పడ్డ సంగతి గుర్తించారు. వెంటనే ఆర్టీఏ వెబ్ సైట్లోకి వెళ్లి ఎవరో అభిమాని ఆ మొత్తం క్లియర్ చేసి పడేశాడు. మహేష్ బాబు మీద తమ ప్రేమ ఇదీ అంటూ దీని మీద ఒక వీడియో కూడా చేశాడు ఆ ఫ్యాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమ అభిమాన హీరో కోసం టికెట్లు కొనడం సహజమే కానీ.. ఇలా ట్రాఫిక్ చలాన్లు కూడా కడతారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. నిన్నటి ఆర్ఎఫ్‌సీ ఈవెంట్లో మహేష్- అభిమానుల మధ్య కెమిస్ట్రీనే మేజర్ హైలైట్‌గా నిలిచింది. జై బాబు.. జై బాబూ అంటూ నినాదాలతో మహేష్ ఫ్యాన్స్ హోరెత్తించేశారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా సహా చాలామంది మహేష్ అభిమానులతో కనెక్ట్ అయి.. వారిని ఎంగేజ్ చేసిన తీరు ఆకట్టుకుంది.
తర్వాత మహేష్ బాబు సైతం అభిమానుల గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడాడు. ఏదో స్పీచ్ ఇస్తున్నట్లు కాకుండా వారితో సంభాషిస్తున్నట్లుగా తన ప్రసంగం సాగింది. అభిమానుల గురించి తాను ఎక్కువగా చెప్పను అంటూనే వాళ్లు తనకెంత ముఖ్యమో చాటి చెప్పాడు మహేష్. వారికి దండం పెట్టి ఎమోషనల్ అయిన తీరు అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.